తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.
గద్వాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా గద్వాల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతవాసులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 44 వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ధర్నాలో కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, సంపత్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో.. పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు. గద్వాలను జిల్లాగా ప్రకటించాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు.