బంద్‌ విజయవంతం | bundh success | Sakshi
Sakshi News home page

బంద్‌ విజయవంతం

Sep 10 2016 9:52 PM | Updated on Mar 23 2019 9:10 PM

బంద్‌ విజయవంతం - Sakshi

బంద్‌ విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్బంగా ప్రత్యేక హోదా చట్టంలో రూపొందించిన అమలు చేయకపోవకపోవడం..కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదానుప్రకటించపోవడం..చంద్రబాబు ప్యాకేజీని ఆహ్వానించడానికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది.

సాక్షి, కడప :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన సందర్బంగా ప్రత్యేక హోదా చట్టంలో రూపొందించిన అమలు చేయకపోవకపోవడం...కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రకటించపోవడం....చంద్రబాబు ప్యాకేజీని ఆహ్వానించడానికి నిరసనగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగానూ, విజయవంతంగానూ ముగిసింది. ప్రత్యేకంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పోలీసులు అణిచివేత చర్యలకు ఉపక్రమించినా ఏమాత్రం జంకకుండా బంద్‌ను పార్టీ శ్రేణులు విజయవంతం చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాను ప్రజలకు వివరించడంతోపాటు ప్రత్యేక హోదా రాకపోతే జరిగే నష్టాన్ని కూడా ర్యాలీలలో నేతలు వివరించారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యబద్దంగా బంద్‌ నిర్వహిస్తున్నా.....రాజ్యాంగ విరుద్దంగా పోలీసులు అరెస్టు చేయడాన్ని పార్టీ నేతలు తప్పుబట్టారు. ఎక్కడికక్కడ దుకాణాలు, సినిమా థియేటర్లు, ప్రై వేటు పాఠశాలలు, హోటళ్లు, కళాశాలలు మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, వామపక్షాలతోపాటు టీడీపీ, బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బంద్‌ సందర్బంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి.
పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాష్, వైఎస్‌ వివేకాల ఆధ్వర్యంలో బంద్‌
        జిల్లాలోని పులివెందులలో తెల్లవారుజామున 3.30 గంటల నుంచే ఆర్టీసీ బస్టాండు, డిపో వద్ద కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఉదయం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండు వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసినంతరం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిల ఆధ్వర్యంలో మెయిన్‌ బజారు మీదుగా పూల అంగళ్ల వరకు పాదయాత్రగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
కడపలో మేయర్, ఇతర నేతల అరెస్టు
            జిల్లా కేంద్రమైన కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద తెల్లవారుజామునే మేయర్‌ సురేష్‌బాబుతోపాటు మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, యువజన విభాగం, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు చల్లా రాజశేఖర్, పులి సునీల్‌కుమార్, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ తదితరులు బైఠాయించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు బస్టాండు ఔట్‌గేట్‌ ఎదురుగా బైఠాయించి నినాదాలు చేశారు. తర్వాత పోలీసులు వచ్చి అరెస్టు చేసి బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తరలించారు. నగరంలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాం బాబు, జిల్లా అ«ధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, వైఎస్సార్‌సీపీ గల్ఫ్‌వైడ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్, రాష్ట్ర కార్యదర్శి నారు మాధవరెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్‌లలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నజీర్‌ అహ్మద్‌ ఐటీఐ సర్కిల్‌లో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులను పోలీసులు గహ నిర్బంధం చేశారు. ఆందోళన నిర్వహిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణను కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
రాజంపేటలో ఆకేపాటి ఆధ్వర్యంలో బంద్‌
        రాజంపేట పట్టణంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్‌ విజయవంతమైంది. శనివారం తెల్లవారుజాము నుంచే ఆకేపాటి రోడ్డుపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. స్వచ్చందంగా షాపులు, ఇతర దుకాణాలు మూసి వేసి మద్దతు తెలిపారు. శనివారం ఉదయం బంద్‌లో పాల్గొంటున్న అమర్‌నాథరెడ్డితోపాటు పోలా శ్రీనివాసులురెడ్డి, చొప్పా యల్లారెడ్డి, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
అన్నిచోట్ల ప్రశాంతంగా బంద్‌
            జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల, జమ్మలమడుగులలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శులు హనుమంతరెడ్డి, గౌసులాజం, జిల్లా ప్రధాన కార్యదర్శి దన్నవాడ మహేశ్వరరెడ్డిలతోపాటు కార్యకర్తలు తెల్లవారుజామున ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకోవడంతో  నేతలంతా బంద్‌ను పర్యవేక్షించారు. నాలుగురోడ్ల కూడలి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాయచోటిలో జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డిలు బంద్‌లో చేపట్టగా, రామాపురంలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో నేతలంతా రోడ్లపై కూర్చొని ఆందోళన చేయగా, ప్రొద్దుటూరులో కూడా వైఎస్సార్‌ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించి బంద్‌ను సక్సెస్‌ చేశారు. బద్వేలులో పార్టీ సమన్వయకర్త వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వామపక్షాలతో కలిసి బంద్‌లో పాల్గొన్నాయి. పోరుమామిళ్లలో వైఎస్సార్‌ సీపీ నేతలు చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి, నాగార్జునరెడ్డిల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. కమలాపురంలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, నాయకులు సీఎస్‌ నారాయణరెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుమిత్ర రాజశేఖర్‌రెడ్డి, వీర ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. రైల్వేకోడూరులో జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డితోపాటు మరికొందరిని గహ నిర్బంధం చేయగా, మిగతా నాయకులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన భారతి సిమెంటు ఉద్యోగులు
        ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గుచూపుతున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ కడప–ఎర్రగుంట్ల ప్రధాన రహదారిలోని పందిళ్లపల్లె వద్ద భారతి సిమెంటు పరిశ్రమకు చెందిన ఉద్యోగులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై దిష్టిబొమ్మను తగులబెట్టారు.
జిల్లా వ్యాప్తంగా 800మందికి పైగా అరెస్టు
        జిల్లా వ్యాప్తంగా శనివారం వైఎస్సార్‌ సీపీ చేపట్టిన బంద్‌ సందర్బంగా పోలీసులు పలువురు నేతలు, నాయకులను అరెస్టు చేశారు. కొందరినీ ఏకంగా గహ నిర్బంధం కూడా చేశారు. జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో సుమారు 800 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం స్టేషన్‌ బెయిలుపై వారిని విడుదల చేశారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement