దూరమై...అంతలోనే చేరువై..! | 18 months later affter meet with husband and wife | Sakshi
Sakshi News home page

దూరమై...అంతలోనే చేరువై..!

Jan 19 2017 2:55 AM | Updated on Aug 16 2018 4:31 PM

పురిటి నొప్పులతో బాధ పడుతున్న భార్యను ఆస్పత్రిలో వదిలి కనిపించకుండాపోయిన భర్త... సుమారు 18 నెలల తరువాత మళ్లీ తన వారికి చేరువయ్యాడు.

రాజేంద్రనగర్‌: పురిటి నొప్పులతో బాధ పడుతున్న భార్యను ఆస్పత్రిలో వదిలి కనిపించకుండాపోయిన భర్త... సుమారు 18 నెలల తరువాత మళ్లీ తన వారికి చేరువయ్యాడు. పొత్తిళ్లలో బిడ్డను పట్టుకొని ఇన్నాళ్లూ ఎదురు చూసిన ఆ భార్య కళ్లలో ఆనందాన్ని నింపాడు. సినిమా కథను తలపించే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... మెదక్‌ జిల్లాకు చెందిన కళాబాయి, సాయిలు భార్యాభర్తలు. 18 నెలల క్రితం నిండు గర్భిణిగా ఉన్న కళాబాయిని సాయిలు ప్రసవానికి గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చి.. ఆ తరువాత కనిపించకుండాపోయాడు. అక్కడ చేరిన నాలుగు రోజులకు ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రెండు నెలల పాటు ఆస్పత్రిలో ఉన్నా... కళాబాయి కోసం ఎవరూ రాకపోవడంతో అక్కడి సిబ్బంది బుద్వేల్‌లోని సెయింట్‌ ఆల్ఫొన్జా కరుణాలయం ఫాదర్‌ థామస్‌కు సమాచారం అందించారు. ఆయన తల్లీబిడ్డలను కరుణాలయానికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి వారిద్దరూ అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. కళావతి చిరునామా సరిగా తెలుపకపోవడంతో ఎన్నిచోట్ల వెతికినా ఆమె భర్త ఆచూకీ లభించలేదు.

నాలుగు రోజుల క్రితం మెదక్‌ జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద ఉండేవారమని ఫాదర్‌తో ఆమె తెలిపింది. ఆ ప్రాంతానికి వెళ్లిన ఫాదర్‌ థామస్‌... సాయిలు వివరాలు సేకరించారు. అప్పటికే సాయిలు భార్య కోసం వెతుకుతున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో ఆయన సాయిలును కలిసి... కళాబాయికి సంబంధించిన పూర్తి వివరాలను రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగారెడ్డితో పాటు తెలంగాణ జాగృతి సర్కిల్‌ కన్వీనర్‌ రగడంపల్లి శ్రావణ్‌లకు తెలియజేశారు. వారి సాయంతో పోలీసుల సమక్షంలో బుధవారం సాయంత్రం సాయిలుకు కళాబాయిని, కూతురుని అప్పగించి మెదక్‌కు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement