లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు | 15 injured of lorry and bus accident | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Jul 15 2017 11:03 PM | Updated on Sep 5 2017 4:06 PM

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు 15 మందికి గాయాలయ్యాయి.

చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు 15 మందికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన మేరకు.. శుక్రవారం రాత్రి గుంతకల్లు నుంచి ఆర్టీసీ బస్సు (ఏపీ02 జెడ్‌ 0374) బెంగళూరుకు బయల్దేరింది. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం సమీపాన 44వ నంబరు జాతీయరహదారిపై కోన క్రాస్‌ వద్ద ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో లారీని రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. హెచ్చరిక కోసం చిన్నపాటి కొమ్మలు, రాళ్లను రోడ్డుపై అడ్డు పెట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అక్కడకు చేరుకున్న ఆర్టీసీ బస్సు దీన్ని గమనించకుండా ముందుకు దూసుకెళ్లింది.

అంతే ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. గాఢనిద్రలో ఉన్న 23 మంది ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు. లారీని బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. డ్రైవర్‌ కుమార్‌ స్టీరింగ్‌ సీటులోనే ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, ఎస్‌ఐ మహమ్మద్‌ రఫికి సమాచారం అందించారు. అనంతరం హైవే పెట్రోలింగ్‌ పోలీసులు నాగరాజు, సుబ్బరాయుడుతో పాటు పలువురు పోలీసులు ఎమర్జన్సీ డోర్‌ పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. బస్సులో మరో డ్రైవర్‌ కుళ్లాయప్ప కాలుకు గాయం కాగా..  15 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసి 108లో అనంతపురం తరలించారు.   ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తూగడం వల్లే ప్రమాదం జరిగిందని, అయితే స్పీడు తక్కువ ఉండటంతో ప్రాణహాని తప్పిందని పలువురు ప్రయాణికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement