10కి పక్కా ఏర్పాట్లు

10కి పక్కా ఏర్పాట్లు


- నేలబారు పరీక్షలుండవ్

- అందుబాటులో మినరల్ వాటర్

- కాపీయింగ్ నిరోధానికి సీసీ, వెబ్ కె మెరాలు

- ‘సాక్షి’తో డీఈవో కృష్ణారెడ్డి


 

 సాక్షి, విశాఖపట్నం: విద్యార్థి జీవితంలో తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వీటి ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. జిల్లాలో నాలుగో వంతు పరీక్షా కేంద్రాల్లో ఫర్నిచర్ లేదు. మరికొన్ని కేంద్రాల్లో కనీస సదుపాయాల కొరత ఉంది.. ఏజెన్సీతో పాటు మరికొన్ని సెంటర్లలో కాపీయింగ్ బెడద కూడా ఉంది. ఈ ఏడాది జిల్లాలో 62 వేల మందికి పైగా టెన్త్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షల ఏర్పాట్లు, సమస్యాత్మక కేంద్రాలు, ఫర్నిచర్ కొరత, సౌకర్యాల కల్పన, కాపీయింగ్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలివి.. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం 62,568 మంది  పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5812 మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. మొత్తం 268 కేంద్రాల కు గాను అర్బన్‌లో 136, రూరల్‌లో 97, ఏజెన్సీలో 35  ఉన్నాయి. ఈ ఏడాది ఒక్కరు కూడా నేలపై కూర్చుని రాయడానికి వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తొలుత 70 కేంద్రాల్లో పాక్షికంగా, 13 సెంటర్లలో పూర్తిగా ఫర్నిచర్ కొరత ఉంది. వీటిలో ఏజెన్సీలోని కేంద్రాలే అధికం.

 

 ఆరు వేల మంది విద్యార్థులకు మూడు వేల బెంచీలు అవసరం ఉంది. దీంతో ఆయా కేంద్రాలకు కొత్తగా బెంచీలు, బల్లలను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇప్పటికే వెయ్యి బెంచీలు వచ్చాయి. మరో రెండు వేలు పరీక్షలు ప్రారంభమయ్యే 21వ తేదీకి ముందే వస్తాయి. ఇంకా ఎక్కడైనా అవసరమైతే అద్దెకు తెస్తాం. అందువల్ల ఈ ఏడాది ఎక్కడా నేలపై పరీక్షలు రాసే పరిస్థితి రాదు.  పరీక్షల నిర్వహణకు 3217 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించాం

 

 మినరల్ వాటర్.. ఫస్ట్ ఎయిడ్..

 విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఏడాది మినరల్ వాటర్‌ను ఏర్పాటు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో ప్రాథమిక చికిత్సను అందుబాటులో ఉంచుతున్నాం. మరుగుదొడ్ల నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లోనూ విద్యుత్ సరఫరాతో పాటు లైట్లు ఉండేలా చర్యలు చేపట్టాం.

 

 11 సమస్యాత్మక కేంద్రాలు

 జిల్లా వ్యాప్తంగా 11 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించాం. వీటిలో ప్రభుత్వ హైస్కూలు- అరకువేలీ, బాలికల ప్రభుత్వ హైస్కూలు-శ్రీకృష్ణాపురం (పాడేరు), జెడ్పీ హైస్కూలు-చింతపల్లి, మున్సిపల్ గరల్స్ హైస్కూలు-అనకాపల్లి, బాలికల జెడ్పీ హైస్కూలు-చోడవరం, అయ్యన్న జూనియర్ కాలేజీ-కె. కోటపాడు, జెడ్పీ హైస్కూలు- వి.మాడుగుల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల-నర్సీపట్నం, జ్ఞాననికేతన్ స్కూల్ (అక్కయ్యపాలెం-విశాఖ) ఉన్నాయి.  అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది

 

 సీసీ, వెబ్ కె మెరాలు

 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటుం.  చింతపల్లి, పాడేరు, అనకాపల్లి, చోడవరం, కె.కోటపాడు, అరకువేలీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మిగిలిన సెంటర్లలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 13 ఫ్లయింగ్, ఐదు సిటింగ్ స్క్వాడ్లను, ఏజెన్సీలో ఇద్దరు స్ట్రయికింగ్ ఫోర్సులను నియమించాం. వీరితో పాటు ఆయా మండలాల తహసీల్దార్లు కూడా పరీక్షా కేంద్రాలను సందర్శిస్తారు.

 

 హాల్‌టిక్కెట్లు రాకపోతే..

 ఇప్పటికే అన్ని సెంటర్లకు హాల్‌టిక్కెట్లను పంపించాం. ఎవరికైనా అందని పక్షంలో ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ  వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటిని సంబంధిత స్కూల్ హెడ్మాస్టర్‌తో ధ్రువీకరించుకుంటే పరీక్షకు అనుమతిస్తారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందే చేరుకునేలా విద్యార్థులు, తల్లిదండ్రులు సన్నద్ధం కావాలి. ఆయా పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతారు/ గంట ముందుగానే బస్సులు అందుబాటులో ఉంటాయి. పరీక్ష కేంద్రాలు సులువుగా తెలుసుకునేందుకు ఈ ఏడాది కోడ్ నంబర్లతో సహా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల వెంట సెల్‌ఫోన్లను అనుమతించబోరు.

 

  శతశాతం ఉత్తీర్ణతకు కృషి

 గత ఏడాది 91.76 శాతం ఉత్తీర్ణత సాధించామని డీఈవో కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఏడాది శతశాతం ఫలితాల సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top