శంకుస్థాపనలో 1.15 గంటలు | 1.15 hours in Foundation | Sakshi
Sakshi News home page

శంకుస్థాపనలో 1.15 గంటలు

Oct 20 2015 4:12 AM | Updated on Aug 15 2018 7:07 PM

శంకుస్థాపనలో 1.15 గంటలు - Sakshi

శంకుస్థాపనలో 1.15 గంటలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ఈ నెల 22న వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో ఏ నిమిషానికి

అమరావతిలో  ప్రధాని షెడ్యూల్ ఇదీ..
 
 నగరంపాలెం(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ఈ నెల 22న వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో ఏ నిమిషానికి ఏ కార్యక్రమంలో పాల్గొంటారనే సమాచారాన్ని సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరోజు శంకుస్థాపన ప్రాంగణానికి ప్రధానమంత్రి మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుని 1.45 గంటలకు తిరిగి వెళతారు. మొత్తం ఒక గంటా 15 నిమిషాలు ప్రధాని ఈ కార్యక్రమంలో ఉంటారు. ప్రధాని వేదికపైకి చేరుకున్న తర్వాత జపాన్ మంత్రి యోషీకీటకీ, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఒక్కొక్కరు మూడు నిమిషాలు మాట్లాడతారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఐదు నిమిషాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రధాని 32 నిమిషాలు ప్రసంగిస్తారు.

 శంకుస్థాపన వేదికపై 17 మంది
 ఏపీ బ్యూరో, విజయవాడ: రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ప్రధాన వేదికపై 17 మంది మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నర సింహన్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, అసోం గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బోసాలే ప్రధాన వేదికపై ఆసీనులు కానున్నారు. కేంద్ర మంత్రులు పూసపాటి అశోక్ గజపతిరాజు, ముప్పవరపు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, నిర్మలా సీతారామన్, బండారు దత్తాత్రేయలకు కూడా వేదికపై అవకాశం కల్పిస్తారు.

 సింగపూర్, జపాన్ మంత్రులకూ..
 సింగపూర్ మంత్రి ఈశ్వరన్, జపాన్ మంత్రి మేతీకి కూడా ప్రధాన వేదికపై అవకాశం కల్పిస్తారు. వీరందరికీ మోస్ట్ వీఐపీ(ఎంవీఐపీ) పాస్‌లు జారీ చేస్తున్నారు. ప్రధాన వేదికకు ఇరువైపులా రెండు వేదికలు ఏర్పాటు చేశారు. ఈ వేదికలపై ఆశీనులయ్యే వారికి ఏఏఏ పాస్‌లను జారీ చేస్తున్నారు. ఈ పాస్‌ల కేటగిరీలో వీవీఐపీలు, వీఐపీలను చేర్చారు. ఒక్కో వేదికపై 350 మంది వంతున 700 మంది ఆసీనులవుతారు. రైతులకు 30,700 పాస్‌లు, స్థానిక ప్రజా ప్రతినిధులు 40 వేల మందికి పాస్‌లు జారీ చేశారు.   

 రామోజీరావుకు ఆహ్వానం..
 ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుకు అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబు సోమవారం ఫిల్మ్ సిటీకి వెళ్లి అందచేశారు.

 ‘శంకుస్థాపన’పై ఎస్పీజీ డేగ కన్ను
 సాక్షి, గుంటూరు: రాజధాని శంకుస్థాపన ప్రదేశం ఉద్ధండ్రాయునిపాలెంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన సుమారు వంద మంది ఎస్పీజీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆశీనులయ్యే ప్రధాన వేదికను, ప్రధాన హెలిప్యాడ్, అక్కడి నుంచి సభా వేదికకు చేరుకునే రహదారులను ఎస్పీజీ ఐజీ పీయూష్ పాండే సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణానికి ఫర్లాంగ్ దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ప్రధాన వేదిక వరకు ఏర్పాటు చేసిన రహదారిలో మంగళవారం ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. మరోవైపు సోమవారానికి మొత్తం 12 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిమిత్తం ఉద్ధండ్రాయునిపాలెం చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement