కొబ్బరిమట్టతో కొట్టి చంపేశారు!

Youth Killed In Robbery Case In West Godavari District - Sakshi

తీవ్రంగా గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి

పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు

సాక్షి, తణుకు: బైక్‌ దొంగలించాడనే నెపంతో ఓ యువకుడిని ఆరుగురు యువకులు కొబ్బరిమట్టలతో చితకబాది హతమార్చారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మంగళవారం జరిగింది. వేల్పూరు గ్రామానికి చెందిన పుట్టా అభిలాష్‌ (20) తల్లిదండ్రులు మృతి చెందడంతో తన సోదరుడు చందుతో కలిసి అమ్మమ్మ జాస్తి నాగమణి వద్దనే ఉంటున్నాడు. నాగమణి గ్రామంలోనే కూలిపనులు చేసుకుంటూ జీవిస్తుండగా అభిలాష్, చందులు ఆమెకు చేదోడువాదోడుగా ఉంటున్నారు.

సోమవారం రాత్రి గ్రామంలోని జాతర సందర్భంగా ఆలస్యంగా వచ్చిన అభిలాష్‌ భోజనం చేసి పడుకున్నాడు. తిరిగి మంగళవారం ఉదయం బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మృతుడి సోదురుడు చందుకు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్‌ చేసి మీ తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చెప్పడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అభిలాష్‌ను అదే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు తీసుకెళ్లి చితకబాదడంతోనే మృతి చెందాడని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం అందించారు.

కొబ్బరి మట్టలతో చితకబాది...
గ్రామానికి చెందిన పుట్టా అభిలాష్‌ ఏ బాధ్యత లేకుండా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో చిన్నచిన్న చోరీలు చేస్తుంటాడని పోలీసులు చెబుతున్నారు. గత నెల 10న గ్రామానికి చెందిన నూనె సురేష్‌ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తన బైక్‌ను అభిలాష్‌ చోరీ చేశాడని భావించిన సురేష్‌ గ్రామానికి చెందిన నూనె నరేష్, పారిచర్ల సాయికృష్ణ, గుణ్ణం సతీష్, లక్కోజు సాయిధన చంద్రశేఖర్, బోడపాటి మనోజ్‌కుమార్‌ అనే డిమ్ములుతో కలిసి అభిలాష్‌ను మంగళవారం గ్రామశివారుకు తీసుకెళ్లారు. వారంతా అభిలాష్‌ను కొబ్బరి మట్టలతో తీవ్రంగా చితకబాదారు. బాధితుడు అపస్మారక స్థితికి చేరడంతో తణుకులోని ఆపిల్‌ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ అతను చికిత్స పొందుతూ అభిలాష్ మృతి చెందడంతో మృతుడి అమ్మమ్మ నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తణుకు సీఐ కేఏ స్వామి, పట్టణ, రూరల్‌ ఎస్సైలు డి.ఆదినారాయణ, సీహెచ్‌వీ రమేష్‌లు మృతదేహాన్ని పరిశీలించారు. నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్ఐ సీహెచ్‌వీ రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top