ప్రొఫెసర్‌తో ప్రేమ.. కిడ్నాప్‌ డ్రామా | Young Women Kidnap Case In Kadapa | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహంతో కథ సుఖాంతం

Jul 5 2018 7:12 AM | Updated on Jul 5 2018 8:49 AM

Young Women Kidnap Case In Kadapa - Sakshi

అధ్యాపకుడు సాయికేశవరెడ్డితో వివాహం అనంతరం లక్ష్మిప్రసన్న

కడప అర్బన్‌ : కడప నగరంలో సంచలనం సృష్టించిన యువతి కిడ్నాప్‌ కలకలానికి బుధవారం తెరపడింది.  ప్రేమ వివాహంతో కథ సుఖాంతంగా మారింది. తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని, తనపై అత్యాచారం చేశారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టి అందరిని టెన్షన్‌కు గురి చేసిన ఆ యువతి చివరకు తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఆడిన డ్రామా ఇది అని తెలిసిపోవడంతో యువతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఈ సంఘటనపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఇంటి నుంచి బయలుదేరిన లక్ష్మిప్రసన్న తన బ్యాగ్‌లో బురఖా పెట్టుకుని అప్సరా సర్కిల్‌ సమీపంలో పద్మావతి స్వీట్స్‌ వద్ద ఆటో ఎక్కింది. కడప నగర శివార్లలో ఉన్న  ప్రైవేట్‌ విద్యాసంస్థలోకి వెళ్లి బురఖా ధరించి, తిరిగి  కడప ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని అక్కడ కర్నూలు బస్సు ఎక్కింది.

అంతకు ముందుగానే పథకం ప్రకారం ఈమెకోసం ప్రియుడు అట్ల సాయికేశవ్‌ రెడ్డి ఆళ్లగడ్డలో ఎదురుచూడసాగాడు. ఆళ్లగడ్డలో బస్సు దిగగానే అక్కడి నుంచి నంద్యాలకు చేరుకుని, కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లి ఆర్యసమాజం పక్కనున్న ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు వాట్సప్‌లో పోలీసు అధికారులకు, స్నేహితులకు పంపించారు. అంతేగాక తాను ఎవరి బలవంతంతో వెళ్లలేదని, తన ఇష్టపూర్వకంగానే వెళ్లి వివాహం చేసుకున్నానని వీడియో కూడా పంపించింది. తన కోసం ఎవరూ వెతకొద్దని కూడా మెసేజ్‌ ద్వారా తెలియజేసింది.

కాగా లక్ష్మిప్రసన్న ప్రేమించి వివాహం చేసుకున్న యువకుడు అట్ల సాయికేశవరెడ్డి ఆమె చదువుతున్న కళాశాలలోనే అధ్యాపకుడిగా పనిచేస్తుండటం గమనార్హం. యువకుని తల్లిదండ్రులు కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్‌బీఐ కాలనీలో నివసిస్తున్నారు.
 
కిడ్నాప్‌ సంఘటనపై చిన్నచౌక్‌ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ యువతి ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. కడప నుంచి వెళ్లిన పోలీసు బృందం యువతి ఆచూకీ తెలుసుకున్నారని, చట్టప్రకారం, నిబంధనల మేరకు  తాము చర్యలు తీసుకుంటామన్నారు. ∙కాగా, యువతి కిడ్నాప్‌.. అత్యాచారం అంటూ  ప్రచారం కావడంతో హడావుడి పడిన పోలీసులు చివరకు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement