ఒక ట్రైన్‌ నుంచి తప్పించుకోబోయి..

Three Teens Died While Taking Selfies On Railway Track In Haryana - Sakshi

చండీగఢ్‌ : హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ పిచ్చితో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. పానిపట్‌లోని ఓ రైల్వేట్రాక్‌పై బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘  ఓ పెళ్లికి హాజరయ్యేందుకు నలుగురు వ్యక్తులు పానిపట్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ రైల్వేట్రాక్‌పై సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అంతలోనే ఎదురుగా ట్రైన్‌ రావడంతో.. పక్కకు తొలగాలని భావించారు. కానీ అదే సమయంలో పక్క ట్రాక్‌పై కూడా మరో ట్రైన్‌ రావడంతో దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు మరణించగా.. ఓ వ్యక్తి ట్రాక్‌కు మరోవైపు దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు’ అని వెల్లడించారు. సోషల్‌ మీడియా మేనియాలో పడిపోయి సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు కోల్పోవద్దని యువతకు విఙ్ఞప్తి చేశారు.

కాగా సెల్ఫీలు తీసుకునే క్రమంలో సంభవించే మరణాల సంఖ్యలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తర్వాతి స్థానాల్లో వరుసగా రష్యా, అమెరికా, పాకిస్తాన్‌ దేశాలున్నాయని వెల్లడించాయి. గతేడాది ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చేసిన పరిశోధన ఆధారంగా.. 2011 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా 259 మంది సెల్ఫీ పిచ్చి కారణంగా ప్రాణాలు కోల్పోయారని తేలింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top