ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం

Three People Lost Their Lives In The Same Day By Electrocution - Sakshi

వేర్వేరు చోట్ల ఒకేరోజు ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు  

సాక్షి, బేస్తవారిపేట: జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో వేర్వేరు చోట్ల ఒకేరోజు ముగ్గురు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. పొలానికి పశువుల మేత కోసం వెళ్లగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బేస్తవారిపేట మండలం పెంచికలపాడులో శుక్రవారం జరిగింది. కొండసాని సుబ్బమ్మ (40) వేరే వాళ్ల పొలంలోకి పశువుల మేత (గడ్డి) కోసుకునేందుకు వెళ్లింది. ఈ సమయంలో పొలం చుట్టూ వేసిన ఇనుప కంచెకు తగిలి విద్యుదాఘాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆవుల నల్లపురెడ్డి పొలంలో విద్యుత్‌ స్టార్టర్‌ ఉంది. స్టార్టర్‌కు విద్యుత్‌ సరఫరా చేసే తీగ తెగి పొలాన్ని ఆనుకుని ఉన్న నర్రా అనంతలక్ష్మి, దొంతా చెన్నయ్యల పొలం చుట్టూ ఉన్న ఇనుప కంచెపై పడింది. సుబ్బమ్మ పొలంలోకి వెళ్లేందుకు ఇనుప కంచెను దాటే సమయంలో విద్యుదాఘాతానికి గురైంది. గట్టిగా కేక పెట్టి అక్కడికక్కడే మృత్యువాత పడింది.

ఆ సమయంలో పొలంలో గడ్డి కోసుకుంటున్న అనంతలక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరారు. విద్యుత్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యుత్‌ సరఫరా నిలిపేయించారు. విద్యుత్‌ మోటార్‌ తీగను తొలగించి సుబ్బమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం రాత్రి వర్షం పడటంతో నీరు, బురద ఉండటంతో రోజూ వెళ్లే మార్గం నుంచి కాకుండా మరో మార్గాన్ని ఎంచుకోవడమే ఆమెకు శాపమైంది. మృతురాలికి భర్త గురువారెడ్డి, కుమారుడు, కుమార్తె ఉంది. సుబ్బమ్మ మృతితో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఎస్‌ఐ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 


భోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు 

పొలం చూసేందుకు వెళ్లి రైతు..
బొట్లగూడూరు (పామూరు): విద్యుదాఘాతంలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు సమీప పొలాల్లో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మండలంలో గురువారం రాత్రి నుంచి వర్షం పడటంతో బొట్లగూడూరు ఎస్సీ కాలనీకి చెందిన మైదుకూరు పెద అంకయ్య (65) తన పొలం చూసుకునేందుకు శుక్రవారం వేకువ జామున వెళ్లాడు. పొలానికి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను పట్టుకున్నాడు. పెద అంకయ్య విద్యుదాఘాతానికి గరై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్న కాలనీ వాసి దాసరి పెద మాల్యాద్రి గమనించి స్థానికులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యురాలు కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. 

టీవీ స్విచ్‌ వేస్తుండగా మహిళ..
లింగసముద్రం: ఓ మహిళ ఇంట్లో టీవీ స్విచ్‌ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మండలంలోని మొగిలిచర్ల ఆదిఆంధ్ర కాలనీలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కేసరపల్లి జయమ్మ గురువారం రాత్రి 10 గంటల సమయంలో టీవీ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీనికి ముందు స్వీచ్‌పై నీరు పడి ఉండటాన్ని ఆమె గమనించలేదు. దీంతో విద్యుదాఘాతానికి గురై జయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుమార్తె కుట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కందుకూరు సీఐ విజయ్‌కుమార్, వలేటివారిపాలెం ఎస్‌ఐ హజరత్తయ్య, లింగసముద్రం ఎస్‌ఐ ఎం.సైదుబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వీఆర్‌ఓ గిరి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top