అజాగ్రత్తగా ఉంటే ఇల్లు గుల్లే..

Robbery Gang hulchul in PSR Nellore - Sakshi

జిల్లాలో పెరిగిన దొంగతనాలు

వేసవిలో ఇంకా పెరిగే అవకాశం

ఎల్‌హెచ్‌ఎంఎస్‌ యాప్‌తో చోరీలకు చెక్‌

స్వీయ జాగ్రత్తలే రక్షణ

అవగాహన పెంచుకోవాలని కోరుతున్న పోలీసులు  

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో దొంగలు విజృంభిస్తున్నారు. ఇల్లు విడిచి బయటకు వెళితే ఇట్టే తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకెళుతున్నారు. ఒంటరి మహిళల మెడల్లోని గొలుసులను తెంపుకెళుతున్నారు. వేసవి దృష్ట్యా వీటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. నేర నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలతోపాటు స్వీయ జాగ్రత్తలు పాటిస్తే నేరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇల్లు విడిచి బయటకు వెళ్లేవారు పోలీసులకు చెప్పి వెళితే మీ ఇంటిని కెమెరా నేత్రంతో కాపాడతారు. దొంగతనం జరిగాక పోలీసుల చుట్టూ తిరిగే కంటే మన సొమ్మును మనమే కాపాడుకుంటే మంచిది.

స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి
మెయిన్‌డోర్‌కు,  బయట ఉన్న మిగతా డోర్లకు నాణ్యమైన, ధృడమైన సెంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకోవాలి.
సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారం సిస్టమ్‌ పెట్టుకుంటే మంచిది.
ఇంటికి తాళం వేసి బయటకు, ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు తదితరాలను బ్యాంకు లాకర్లలో పెట్టాలి. కుదరని పక్షంలో బంధువుల ఇళ్లలో ఉంచాలి.
ఇంటి కిటికీలు తెరుచుకుని నిద్రపోయే సమయంలో వస్త్రాలు, బ్యాగ్‌లు, విలువైన వస్తువులను కిటికీ నుంచి అందనంత దూరంగా ఉంచాలి.
వేసవి కాలంలో ఇంటిపైన, ఇంటి బయట నిద్రపోయేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంటి డోర్లకు వేసే గడియల స్క్రూలను దొంగలు సులభంగా స్క్రూ డ్రైవర్‌తో తీసిలోపలకు చొరబడే అవకాశం ఉంది. కాబట్టి ధృఢమైన స్క్రూలు, శాశ్వత ఫిక్సింగ్‌ గ్రిల్స్‌ వాడాలి.
ఆరుబయట నిద్రించే సమయంలో ఒంటిపై ఆభరణాలు ధరించకపోవడం మంచిది.
వేసవి ఉక్కపోత దృష్ట్యా తలుపులు తెరిచి నిద్రించరాదు.
అపార్ట్‌మెంట్‌లలో నివసించేవారు సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేసుకోవాలి.
వాచ్‌మన్‌ను తప్పనిసరిగా కాపలా పెట్టాలి. అపార్ట్‌మెంట్‌ మెట్ల వద్ద అతను ఉండేలా చూసుకోవాలి. లిఫ్ట్‌ ఆపివేయాలి.
తాళం వేసిన ప్లాట్‌లను అరగంటకోసారి చెక్‌ చేయాలి. అపార్ట్‌మెంట్‌కు వచ్చే కొత్త వ్యక్తుల వివరాలను విజిటర్‌ రిజిస్ట్రర్‌లో పొందుపరిచాక లోనికి అనుమతించాలి.
ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే డయల్‌ 100కు లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
కొత్త వ్యక్తులు కాలింగ్‌బెల్‌ కొడితే డోర్‌కు ఉన్న రంధ్రం ద్వారా లేదా కిటికీ నుంచి చూశాకే డోర్‌ తెరవాలి
ఇంట్లో దొంగతనం జరిగితే ఏ వస్తువునూ తాక రాదు. బీరువాలను ముట్టుకోరాదు.
 పోలీసులు వచ్చి వేలిముద్రలు తీసుకునే వరకు ఎదురుచూడాలి.
ప్రతి ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లో విధిగా స్థానిక పోలీసు స్టేషన్‌ ఫోన్‌నంబర్‌ అందుబాటులో ఉంచుకోవాలి.
ఇంటికి తాళం వేస్తే పక్కింటి వాళ్లకు గానీ, బంధువులకు లేదా ఆ ప్రాంత పోలీసు స్టేషన్‌లో గానీ సమాచారం ఇవ్వాలి.

ఇలా చేస్తే మేలు
పాస్‌పోర్టులు, ఇతర విలువైన వస్తువులు, ఆభరణాలు, నగదు తదితరాల కోసం బ్యాంకు లాకర్లు ఏర్పాటు చేసుకోవడం మేలు.
ఇంటి పరిసరాలు, తలుపులు రోడ్డుపైకి కనిపించేలా నిర్మించుకోవాలి.
స్తోమత ఉన్నవారు ఇంట్లో వెబ్‌ ఆధారిత కెమెరాలు, పరిసరాల్లో సెన్సార్‌ దీపాలు, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.

స్మార్ట్‌ ఫోన్లు లేకపోతే..
స్మార్ట్‌ ఫోన్లు లేని వారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ ప్రయోజనాన్ని పొందేందుకు నేరుగా స్థానిక పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలి. అక్కడ స్టేషన్‌ హౌస్‌ అధికారిని కలిసి సిస్టమ్‌ అవసరాన్ని తెలియజేయాలి. అభ్యర్థనను స్వీకరించిన పోలీసు అధికారి దరఖాస్తుదారుడి ఇంటికి సాంకేతిక భద్రతను అర్చేందుకు సిబ్బందిని ఆదేశిస్తారు. ఊరు బయల్దేరే కనీసం 24 గంటల ముందు యజమాని వ్యవస్థ ఏర్పాటును కోరితే మరింత మెరుగైన సౌకర్యాలు అందించగలమని పోలీసులు చెబుతున్నారు. ఈ సేవలు పూర్తిగా ఉచితం.

యాప్‌తో చెక్‌
దొంగతనాలను నివారించేందుకు పోలీసులు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు యాప్‌ను గూగుల్, ప్లే స్టోర్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో ఇంటి భద్రత కోరేవారు తమ పేరు, చిరునామా, సెల్‌ఫోన్‌ నంబర్‌తో నమోదు కావాలి. యాప్‌లోనే మరో ప్రవేశికలో ఇంటినుంచి బయటకు వెళ్లే తేదీ, తిరిగి వచ్చే తేదీలను పూరించాలి. ఆ వివరాలు పోలీసు కంట్రోల్‌రూమ్‌కు చేరుతాయి. తర్వాత సదరు సిస్టమ్‌ను పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి తీసుకువస్తారు. ఇంట్లో ఓ అనుకూలమైన చోట కెమెరాను ఏర్పాటు చేస్తారు. కెమెరా కంటికి ఏ మాత్రం అసాధారణ కదలికలు చిక్కినా అవి కంట్రోల్‌ రూమ్‌లో అలారం రూపంలో పోలీసుల దృష్టికి చేరుతాయి. ఇంటి యజమానిని అప్రమత్తం చేస్తాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు.

నిఘా వైఫల్యానికి ప్రధాన కారణాలివే..
గస్తీ విధుల్లో ఉన్న సిబ్బందికి తగిన అవగాహన లేకపోవడం, నేరస్తుల చిత్రాలు, ఉన్నతాధికారులు సూచనలు అందకపోవడం, జైలు నుంచి బయటకు వచ్చే పాతనేరస్తుల కదలికలపై నిఘా కొరవడడం, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడంతో నేరగాళ్లు విజృంభిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top