కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Road Mishap In Kondagattu - Sakshi

కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 101 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. 44 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదు మృతదేహాలు కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కొండగట్టు అంజన్న స్వామి భక్తులు. దేశ ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల్లో డ్రైవర్‌ కూడా ఉన్నాడని తెలుస్తోంది.

కొండగట్టు ఘాట్‌ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువగా 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ‍్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిం​చారు. అటు ఆపద్ధర్మ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్‌ స్పందిస్తూ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్‌, ఎస్‌పీ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు చెప్పారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు.

ప్రమాదం చాలా బాధాకరం: రవాణ మంత్రి
కొండగట్టు రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఆపద్ధర్మ రవాణ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. ఈ కొండపై తొలిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. తను ఘటనాస్థలికి బయలు దేరుతున్నానని, ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి ఈటల రాజేందర్‌ అక్కడికి చేరుకున్నారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద వివరాలను ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామన్నారు.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
కొండగట్టు ఆర్టీసీ ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి : కొండగట్టు రోడ్డుప్రమాదంపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

(ఈ విషాదానికి సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top