సైకో భయం! | Psycho fear In Kovuru | Sakshi
Sakshi News home page

సైకో భయం!

Mar 16 2018 9:35 AM | Updated on Mar 16 2018 9:35 AM

Psycho fear In Kovuru - Sakshi

యువకుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు

కొడవలూరు: కోవూరులో సంచలనం సృష్టించిన సైకో భయం ఇప్పటికీ వీడలేదు. మతిస్థిమితం లేని వ్యక్తిని సైకోగా భావించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించా రు. ఈ ఘటన మండలంలోని గుండాలమ్మపాళెం గాంధీ గిరిజన కాలనీలో గురువారం చోటుచేసుకొంది. కాలనీలో మహిళలు దుస్తులు ఉతుక్కొంటుండగా వారున్నచోటుకు ఓ మతిస్థిమితం లేని యువకుడు వెళ్లి హిందీలో బెదిరించినట్లు మాట్లాడాడు. మహిళలు భయాందోళనకు గురై సైకో అంటూ కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ యువకుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి అక్కడే కట్టేశారు. నంబర్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఆ సమాచారం తెలుసుకున్న దగదర్తి ఎస్సై విజయకుమార్‌ స్థానిక పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి చేతిలో బ్లేడు కూడా ఉందని మహిళలు తెలియజేయడంతో యువకుడ్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. ఎలాంటి ఆయుధాలు లేకపోగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుండటంతో స్టేషన్‌కు తరలించి వివరాలు రాబట్టేందుకు యత్నించారు.

హిందీలో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడే తప్ప పేరు కూడా చెప్పలేకపోయాడు. దీంతో ఇతర రాష్ట్రానికి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. స్థానికులు చితకబాదడంతో యువకుడికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఆ యువకుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. కోవూరులో అలజడి సృష్టించిన సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం ఉన్నా పోలీసు వర్గాలు అధికారికంగా ధ్రువీకరించకపోవడంతో సైకో భయం ప్రజలను వీడలేదు. రోజూ ఏదోఒక చోట సైకో పేరుతో మద్యంప్రియులు, మతిస్థిమితం లేని వ్యక్తులను ఆయా ప్రాంతాలవారు చితకబాదుతూనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement