కనీవినీ ఎరుగనిరీతిలో పట్టుబడ్డ పాత కరెన్సీ!

Police seized demonetised currency notes Rs 20 crore in kanpur - Sakshi

కాన్పూర్‌ : ఉత్తరప్రదేశ్‌లో కనీవినీ ఎరుగనిరీతిలో రద్దైన కరెన్సీనీ పట్టుబడింది. కాన్పూర్‌లోని స్వరూప్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో కోట్లాది రూపాయల నోట్లకట్టలు దొరికాయి. రద్దుచేసిన రూ. 500, వెయ్యి నోట్ల కట్టలు భారీ ఎత్తున పరుపులా పేర్చి ఉండటాన్ని చూసి అధికారులే నివ్వెరపోయారు. భారీ మొత్తంలో దొరికిన పాత నోట్లకట్టల్లో ఇప్పటికే రూ. 97 కోట్లమేర లెక్కించారు. ఇంకా లెక్కించాల్సిన నోట్లకట్టలు ఉండటంతో వందకోట్లకుపైగానే రద్దైన కరెన్సీ ఇక్కడ దాచినట్టు భావిస్తున్నారు.

జాతీయ దర్యాప్తు బృందాలు, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. సీజ్ చేసిన పాత కరెన్సీ విలువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్వహించిన దాడుల్లో పెద్దమొత్తంలో పాత కరెన్సీని జాతీయ సంస్థలు పట్టుకున్నాయి. కానీ, ఇంతమొత్తంలో రద్దైన కరెన్సీ ఎప్పుడూ దొరకలేదు.

కాబట్టి పెద్దనోట్ల రద్దు తర్వాత అతిపెద్దమొత్తంలో పట్టుబడిన పాత కరెన్సీ ఇదేనని భావిస్తున్నారు. పెద్దనోట్లను రద్దు చేసి ఏడాది దాటినా ఇప్పటికీ పెద్ద మొత్తంలో పాత కరెన్సీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కాన్పూర్‌లో ఓ వ్యక్తి నివాసంలో రద్దు అయిన పాతనోట్లు భారీగా ఉన్నాయన్న పక్కా సమాచారంతో పోలీసులు ఈ తాజా ఆపరేషన్‌ నిర్వహించినట్టు తెలుస్తోంది.  ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top