లారీ ఎక్కించి చంపేస్తా!

Phone Call Threats To Women SP Urmila In Tamil Nadu - Sakshi

ఖైదీలను హింసిస్తే ఖతం చేస్తా

జైళ్ల శాఖ మహిళా ఎస్పీకి రౌడీ హెచ్చరిక

వాట్సాప్‌ ద్వారా బెదిరింపుల ఆడియో సందేశం

రౌడీ కోసం పోలీసుల వేట

సాక్షి ప్రతినిధి, చెన్నై: పోలీసుశాఖలో ఆమె ఉన్నతమైన హోదా కలిగిన ఉద్యోగి. అతడు పోలీసుల జాబితాలో కరుడుగట్టిన రౌడీ. అయితేనేం.. ఆమె హోదా కంటే తన నేరసామ్రాజ్యమే బలమైనదిగా చాటుకునే ప్రయత్నం చేశాడు. హోదాను అడ్డుపెట్టుకుని ఖైదీల జోలికెళితే ఖతం చేస్తా... లారీ ఎక్కించి అంతం చేస్తానని ధైర్యంగా వాట్సాప్‌ సందేశం పంపి రాష్ట్ర జైళ్లశాఖలో వణుకు పుట్టించాడు. మదురై జైళ్లశాఖ మహిళా ఎస్పీ ఊర్మిళకు బుల్లెట్‌ నాగరాజన్‌ అనే పేరొందిన రౌడీ హత్యా బెదిరింపులకు పాల్పడుతన్న వాట్సాప్‌ ఆడియో శుక్రవారం వైరలైంది. వివరాలు.

తేని జిల్లా పెరియకుళం సమీపం జయమంగళానికి చెందిన బుల్లెట్‌ నాగరాజన్‌ రాష్ట్రంలో పేరొందిన రౌడీ. ఇతనిపై హత్య, దొంగతనాలు, దారిదోపిడీ తదితర 50కి పైగా కేసులున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు అతడు కొంతకాలంగా అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. బుల్లెట్‌ నాగరాజన్‌ అన్న 2006లో ఒక హత్యకేసులో అరెస్టయి మదురై సెంట్రల్‌ జైల్లో యావజ్జీవ శిక్షను అనుభవించాడు. ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగడం అలవాటు చేసుకున్నాడు. ఖైదీలకు వైద్యపరీక్షల నిమిత్తం  వారం రోజుల క్రితం జైలుకు వచ్చిన మహిళా డాక్టర్‌ వద్ద నిద్రమాత్రల కోసం పేచీపెట్టుకున్నాడు. ఇందుకు అంగీకరించిన మహిళా డాక్టర్‌పై ఆగ్రహంతో ఊగిపోతూ తన చొక్కావిప్పి ఆమె ముఖంపై వేశాడు. డాక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మదురై జైళ్లశాఖ మహిళా పోలీసు సూపరింటెండెంట్‌ ఊర్మిళ విచారణ చేపట్టారు.

కమాండోల సహాయంతో అతడిని సెల్‌లో పెట్టించారు. ఇదిలా ఉండగా, ఎంజీఆర్‌ శతజయంతి సందర్భగా కొందరు ఖైదీలతోపాటూ బుల్లెట్‌ నాగరాజన్‌ అన్న కూడా ఇటీవల విడుదలయ్యాడు. జైలు నుంచి బైటకు రాగానే తన తమ్ముడు నాగరాజన్‌ వద్దకు వెళ్లి ఈ గొడవ గురించి వివరించాడు. కోపోద్రిక్తుడైన నాగరాజన్‌..తన సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ ద్వారా ఎస్పీ ఊర్మిళ, మహిళా డాక్టర్‌కు ఆడియో మెసేజ్‌ పంపాడు. ‘గ్రేట్‌ జనరల్‌ బుల్లెట్‌ నాగరాజన్‌ను మాట్లాడుతున్నా. తమిళనాడులో నేను చూడని జైలు లేదు. ఎంతో మంది ఖైదీలను కొట్టి హింసిస్తున్నారు. మదురై జైలుకు సంబంధించి మీకు నిర్వాహణ సామర్థ్యమే లేదు. ఖైదీలను కొట్టేందుకే కమాండో పార్టీలను పెట్టుకున్నారు. ఖైదీలను కొట్టిన ఒకేఒక కారణంతో జైలర్‌ జయప్రకాష్‌ను సజీవదహనం చేసిన విషయం జ్ఞాపకం ఉందా అయినా మీరు ఎందుకు మారడం లేదు మా నడతను మార్చుకుని ప్రస్తుతం పెద్దమనుషులుగా చలామణి అవుతున్నాం.

ఖైదీలతో ఏదైనా సమస్య వస్తే మీరు ఏంచేస్తారో అదే మేమూ చేయాల్సి వస్తుంది. మనిషికి ఆరేళ్లలోనూ..నూరేళ్లలోనూ కూడా చావు రావచ్చు. దానికి గురించి నాకు బెంగలేదు. మీకు చివరి అవకాశం ఇస్తున్నా. జైలు సూపరింటెండెంట్‌ గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నాడు. అతడిని అడ్డుపెట్టుకుని ఖైదీల సొమ్మును కాజేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేందుకు సిగ్గులేదా...వేరే ఏదైనా వృత్తి చేసుకోవచ్చు కదా. ఇంతగా మాట్లాడుతున్నా, నన్ను ఏమైనా చేసి చూడండి, నేను పాత బుల్లెట్‌ నాగరాజన్‌కు కాదు. జైల్లో విధులు ముగించుకుని మీరు బైటకు వచ్చి తీరాలికదా. నేనేమీ చేయను, నా అనుచరులు ఏదైనా చేస్తారు..లారీ మీ మీదఎక్కవచ్చు..మారండి..అంటూ ఆడియో ద్వారా హెచ్చరించాడు.  మహిళా ఎస్పీకి వచ్చిన ఈ బెదిరింపు జైళ్లశాఖలో కలకలం రేపింది. అజ్ఞాతంలో ఉన్న బుల్లెట్‌ నాగరాజన్‌ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. హత్యాబెదిరింపులపై ఎస్పీ ఊర్మిళ ఇంతవరకు ఫిర్యాదు చేయలేదు, ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు చేపడతామని మదునగర పోలీస్‌ కమిషనర్‌ డేవిడ్సన్‌ దేవా మీడియాకు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top