
సాక్షి, హన్వాడ(మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. శనివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా రామయ్యపాలెంకు చెందిన గంగిరెడ్డి (34), అదేజిల్లా మార్కాపురంకు చెందిన సాదిక్ పాష భార్యతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సాదిక్ తన భార్యను గంగిరెడ్డి నుంచి దూరం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం శేక్‌పల్లికి వలసవచ్చి మిషన్‌భగీరథ పనుల్లో మేస్త్రీగా పనికి కుదిరాడు.
వారి అడ్రస్ తెలుసుకున్న గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. సాదిక్ భార్య అతన్ని మందలించి వెళ్లిపొమ్మని చెప్పింది. నిద్రలేచిన సాదిక్ అతన్ని గుర్తించేలోగా గంగిరెడ్డి పరారయ్యాడు. చాలాసేపటి వరకు సాదిక్ ఇంట్లోకి రాకుండా ఆరుబయటే కావలి కాశాడు. గంగిరెడ్డి అతని కళ్లుగప్పి మళ్లీ ఇంటికి వచ్చాడు. కామంతో సాదిక్ భార్యను కలిసే ప్రయత్నం చేయగా గమనించిన సాదిక్ ఇంట్లో ఉన్న చాకుతో పొడిచాడు.
గంగిరెడ్డి అరుస్తూ దూషిస్తుండగా అదే కత్తితో గొంతు కోశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటనపై మహబూబ్‌నగర్ రూరల్ సీఐ, ఏఎస్‌ఐ వెంకట్‌స్వామి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. గంగిరెడ్డి మృతదేహాన్ని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.