మిస్టరీగా.. గుర్తుతెలియని మహిళ హత్యోదంతం..!

Mystery..unknown woman murder case - Sakshi

 ఈ నెల 6న తుంగపహాడ్‌ శివారులో వెలుగులోకి..

పోస్టుమార్టం నివేదికలో గర్భిణిగా వెల్లడి

ఖాకీలకు అందని ఫిర్యాదు

పోలీసులకు సవాల్‌గా మారిన కేసు

ఆరురోజులు గడుస్తున్నా   ముందుకు పడని అడుగు 

పరువు హత్యా.. ప్రియుడే కాటేశాడా?

మిర్యాలగూడ రూరల్‌ : మండల పరిధిలోని తుంగపహాడ్‌ శివారులో ఇటీవల వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. అసలీ హత్యపై ఇప్పటి వరకు ఫిర్యాదు కూడా అందకపోవడంతో కేసు ఛేదన ఖాకీలకు సవాల్‌గా మారింది.

గుర్తుతెలియని మహిళగా..
మండల పరిధిలోని తుంగపహాడ్‌ శివారులోని అడవిదేవులపల్లి రోడ్డులో ఈ నెల 6వ తేదీన గుర్తుతెలియని మహిళను హత్యచేసి ఆపై కాల్చేసిన విషయం తెలిసిందే.  హత్యోదంతంపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయకపోవడంతో గుర్తుతెలియని మహిళగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మూడు బృందాలు.. మూడు ప్రాంతాలు
సీఐ రమేష్‌బాబు నేతృత్వంలో వాడపల్లి, అడవిదేవులపల్లి, మాడ్గులపల్లి పోలీస్‌స్టేషన్ల ఖాకీలు మూడు బృందాలుగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. తొలు త రెండు రాష్ట్రాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల వారీగా మిస్సింగ్‌ కేసులపై దృష్టిపెట్టినా ఇప్పటి వరకు అలాంటి కేసులు తారస పడలేదని పోలీసులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే హత్యోదంతం వెలుగులోకి వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించకపోవడంతో ఖాకీలు తలపట్టుకుంటున్నారు. ఏది ఏమైనా కేసును సాధ్యమైనంత త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

అంతుచిక్కని ప్రశ్నలెన్నో..

సదరు గుర్తుతెలియని మహిళ ఎవరు..? ఏ ప్రాంతానికి చెందింది..? ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కాల్చేశారా..? పోస్టుమార్టం నివేదికలో గర్భిణిగా తేలింది. అయితే, సగం కాలిన మహిళ కు పుస్తెమెట్టెలు లేవు. దీంతో పరువు కోసం కుటుంబ సభ్యులే హత్య చేశారా..? లేక పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడే కాటేశాడా..? ఇలా అంతుచిక్కని ప్రశ్నలెన్నో పోలీసులకు సవాల్‌గా మిగిలాయి.

పోస్టుమార్టం నివేదికలో..

సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు అదే రోజు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్య సౌకర్యాలు లేవని ఇక్కడి వైద్యులు పోస్టుమార్టం చేయడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు ఉన్నతాధికారుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రి వైద్యులను రప్పించి ఈ నెల 8వ తేదీన గుర్తుతెలియని మహిళ మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నివేదికలో సదరు మహిళ గర్భిణిగా తేలింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top