ఎందుకిలా చేశావమ్మా..!?

A Mother Left Her Newborn Daughter In korutla - Sakshi

‘అమ్మా.. రోజులు మారిపోతున్నాయ్‌. అమ్మో.. ఆడపిల్ల అనుకుని మమ్మల్ని కనిపెంచడానికి మీరు ఎందుకు బెదిరిపోతున్నారో.. పురిట్లోనే ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదమ్మా. ఈ కాలంలో ఆడపిల్ల అన్నింట్లో ముందుంటుంది. మహాలక్ష్మీకి మారుపేరుగా మీ ఇంటి ముంగిట్లో సిరులు చిందిస్తోంది. ఇదివరకు ఆడపిల్లను కనడానికి మీలాంటి తల్లులు వెనకంజ వేసిన అనర్థం ఫలితంగా ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల్లో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునే సంస్కృతి వచ్చేసింది. కాస్త ఊపిరినిచ్చి.. ఊతమివ్వండి చాలమ్మా.. మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటాం. ఈకాలం ఆడపిల్ల మీకు భారం కాదని నిరూపిస్తాం.. అమ్మా..కాస్త కనికరించండి..కని పెంచండి’.. పదిరోజుల వ్యవధిలో జగిత్యాల జిల్లాలోని రెండు చోట్ల పురిట్లోనే తల్లి పొత్తిళ్ల నుంచి ముళ్ల పొదల పాలైన ఆడశిశువుల ఆక్రందనకు ఇది అక్షరరూపం.

కోరుట్ల(కరీంనగర్‌) : జగిత్యాల జిల్లా రాయికల్‌ మండల కేంద్రంలో ఈ నెల 1వ తేదీన వేకువజామున ఆడశిశువును చంపి వదిలేసిన సంఘటను మరవకముందే కోరుట్లలో ఓ ఆడశిశువును పురిట్లోనే ముళ్ల పొదల్లో వదిలేసిన సంఘటన చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే..కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్‌లోని రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అక్కడ ఉండే స్థానికుల కు శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన ఆడశిశువును వదిలేసి వెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకుడు కస్తూరి లక్ష్మీనారాయణ అక్కడికి వచ్చి వెంటనే శిశువును స్థానిక పిల్లల ఆసుపత్రికి పంపించారు. డాక్టర్‌ దిలీప్‌రావు శిశువుకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం బాగానే ఉందని నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరుట్ల ఎస్సై రాజునాయక్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రిలో ఉన్న శిశువును ఐసీడీఎస్‌ సీడీపీవో తిరుమలదేవి, సూపర్‌వైజర్‌ ప్రేమలత కు అప్పగించారు. అక్కడి నుంచి శిశువును కరీంనగర్‌లోని శిశుగృహాకు తరలించారు. 

కన్నతల్లిని గుర్తించారు..
ఆడశిశువు దొరికిన వైనం కోరుట్లలో కలకలం రేపగా కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు అధ్వర్యంలో ఎస్సై రాజునాయక్‌ శిశువును తీసుకువచ్చి వదిలేశారన్న విషయాన్ని ఆరా తీశారు. సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన తర్వాత ఝాన్సీరోడ్‌లోనే నివాసముండే బాణాల రేఖ అనే మహిళ శిశువును వదిలేసి వెళ్లినట్లు నిర్ధారణ అయింది. ఆ వెంటనే పోలీసులు ఆమెను ప్రశ్నించి ఆసుపత్రికి తరలించారు. బాణాల రేఖ భర్త కృష్ణ కొడిమ్యాలలో ట్రాన్స్‌కో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. రేఖతో పాటు ఆమె అక్కను బాణాల కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ మొదటి భార్యకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. రెండో భార్య రేఖకు ఇద్దరు ఆడశిశువులు ఉన్నారు. ఈ క్రమంలో మరో ఆడశిశువును పెంచడం భారంగా భావించి వదిలేసేందుకు నిశ్చయించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కృష్ణకు ఈ మధ్యే కొడిమ్యాలకు బదిలీ అయినట్లు సమాచారం. కోరుట్లలో ఇల్లు ఖాళీ చేసి ఇద్దరు భార్యలతో కలిసి కొడిమ్యాలలో అద్దె ఇల్లు తీసుకుని ఉండేందుకు యత్నిస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కన్నతల్లి ఆడశిశువును వదిలేసిన సంఘటన కోరుట్లలో కలకలం రేపింది. పోలీసులు ఆడశిశువును వదిలేసిన తల్లి రేఖపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top