పైశాచికం | Sakshi
Sakshi News home page

పైశాచికం

Published Fri, May 4 2018 9:52 AM

molestation Photos Upload In Social Media Girl Suicide - Sakshi

ఇక్కడ..అక్కడ..అని కాదు. దేశంలోని పట్టణ ప్రాంతాలైనా..మారుమూల ప్రాంతాలైనా..చివరికి ఆదివాసీ కొండ ప్రాంతాలైనా..దుర్యోధన, దుశ్శాసన దుర్వినీతి లోకంలో..అడుగు బయట పెట్టాలంటే బాలికలు, మహిళలకు వణుకు పుడుతోంది. ఎక్కడ ఏ కామాంధుడు ఏ వైపు నుంచి కాటేస్తాడోనన్న ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. బాలికలు, మహిళలను బయటకు పంపించాలన్నా..తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు కూడా చిగురుటాకుల్లా కంపిస్తున్నారు. ఎక్కడ నుంచి ఏ దుర్వార్త  వినాల్సి వస్తుందోనని గుండెలు అరచేతిలో పెట్టుకుని   భీతిల్లుతున్నారు.

ఒరిస్సా ,జయపురం: నేటి సమాజంలో బాలికలు, మహిళలపైన అత్యాచారాలు,  హత్యలు  ప్రతిరోజూ పెరుగుతున్నట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి. ఇది దేశ ప్రజలను కలవర  పరుస్తున్నా..కామాంధుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. ఇటువంటి సంఘటనలు అన్ని ప్రాంతాలలోను వెలుగుచూస్తున్నాయి. బహుళ ఆదివాసీ ప్రాంతమైన అవిభక్త కొరాపుట్‌ జల్లాలో కూడా తరచూ ఇటువంటి అమానుష సంఘటనలు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా  బాలికలు, వివాహితులను మానభంగం చేసి ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ పైసాచికంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి పైసాచిక చర్య వల్ల ఒక   బాలిక సమాజంలో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్‌ జిల్లా ఝోరిగాం సమితిలోని ఒక గ్రామంలో ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు జగన్నాథ్‌గౌడ అనే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ దారుణాన్ని   వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు. ఆ వీడియో క్లిప్పింగ్‌లను గ్రామవాసులంతా చూశారు. ఈ విషయం తరువాత ఆ యువకుడు గ్రామం విడిచి పరారయ్యాడు.

కుంగిపోయిన తల్లిదండ్రులు
కుమార్తెను అత్యాచారం చేసిన వీడియో వైరల్‌ కావడంతో బాలిక తల్లి దండ్రులు సిగ్గుతో కుంగిపోయారు. ఆ వైరల్‌ ప్రసారాన్ని నిలుపు చేసేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేక పోయారు. చట్టం పట్ల వారికి అవగాహన లేక చైతన్యవంతులు కాక పోవడంతో ఈ విషయంపై పోలీసులకు కూడా  ఫిర్యాదు చేయలేకపోయారు. బాధిత బాలిక సోమవారం తన సోదరిని వెంట తీసుకుని కట్టెలు ఏరేందుకు సమీప అడవికి వెళ్లింది. కొంత సమయం తరువాత చెల్లెలిని ఇంటికి పంపేసింది. అక్క ఇంటికి ఎప్పటికీ రాకపోవడంతో తల్లిదండ్రులకు సోదరి విషయం తెలిపింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమె కోసం   అన్ని ప్రాంతాలలోను వెతికారు. కానీ జాడ కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం ఝెరిగాం పోలీసులకు సమాచారం తెలియజేశారు.

అడవికి వెళ్లి ఇంటికి రాని బాలిక
 ఫిర్యాదు అందిన తరువాత ఝోరిగాం ఎస్‌డీపీఓ హేమంత కుమార్‌పాఢి, ఎస్సై సుభాష్‌ బెహరా తమ సిబ్బందితో గ్రామానికి వచ్చి విచారణ జరిపారు. కనిపించని బాలిక అడవికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారు అడవికి వెళ్లారు. అక్కడ ఆ బాలిక ఆత్మహత్య చేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలిక ఆత్మహత్య విషయం తెలిసిన నవరంగ్‌పూర్‌ ఎస్‌పీ వివేకానంద శర్మ ఝోరిగాం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కేసు వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుని విచారణ చేశారు. నాలుగు నెలల కిందట ఆ బాలికపై అదే గ్రామానికి చెందిన జగన్నాథ్‌గౌడ అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుసుకున్న ఎస్‌పీ..శీఘ్రంగా సమగ్ర దర్యాప్తుపై పోలీసులను ఆదేశించారు. వీడియో వైరలోని ఫొటోలను పరిశీలించిన పోలీసులు ఆ గ్రామంలోని ముగ్గురు యువకులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వచ్చి తమదైన శైలిలో విచారణ చేసి విడిచి పెట్టారు. వారు తెలిపిన విషయాల మేరకు పోలీసులు అన్ని ప్రాంతాలలోను నింది తుడు గౌడ కోసం గాలించారు. ఎట్టకేలకు జగన్నాథ్‌ గౌడను అరెస్ట్‌ చేసి కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
ఈ అమానుష సంఘటనపై  అవిభక్త కొరాపుట్‌లో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఈ దారుణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మృతురాలి కుటుంబం చాలా నిరుపేదదని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామప్రజలు కోరుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement