గుట్టుచప్పుడు కాకుండా..!

Marijuana Smuggling in Coconut Transport Lorry Prakasam - Sakshi

కొబ్బరి పిట్టు లోడులో గంజాయి రవాణా

రూ.కోటి విలువైన 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు  

కీలక నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందం ముమ్మర గాలింపు

మార్టూరు: గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా వారి కళ్లు కప్పి కొత్త కొత్త దారుల్లో గంజాయిని తరలించేస్తున్నారు. తాజాగా శనివారం రాజుపాలెం చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో రూ.కోటి విలువైన 600 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోనికి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌లో విచారించిన అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు  సమాచారం..

మూడు రోజులుగా నిఘా..
జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ వై జయరామ సుబ్బారెడ్డి, ఇంకొల్లు సీఐ ఆర్‌ రాంబాబు, ఎస్సై శివకుమార్‌లతో కలిసి మూడు రోజులుగా రాజుపాలెం చెక్‌పోస్టు వద్ద నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి వ్యవసాయానికి వినియోగించే కొబ్బరి పిట్టు లోడుతో వెళుతున్న లారీని ఆపి అధికారులు తనిఖీ చేశారు. లారీలో అడుగు భాగాన కంప్రెషర్‌ చేయబడిన గంజాయి ప్యాకెట్‌లు ఉంచి వాటి పైన కొబ్బరిపిట్టు లోడు చేసి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్‌లు సుమారు 600 కేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కీలక నిందితులు మదనపల్లి ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్న అధికారులు శనివారం రాత్రికి రాత్రే ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ రూ.కోటి ఉండవచ్చని అధికారులఅంచనా. 

ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి..
ఒడిస్సా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి తూర్పు గోదావరి జిల్లాకు సరఫరా అయిన గంజాయి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు ప్రాంతం నుంచి సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలకు గంజాయి అక్రమంగా తరలిపోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి 8, 9 జిల్లాలు దాటి రాష్ట్ర సరిహద్దుల వరకు గంజాయి అక్రమంగా తరలిపోతుండగా మధ్యలో ఉన్న జిల్లాల అధికారుల తీరు పలు అనుమానాలుకు దారితీస్తుంది. అక్కడక్కడ కొన్నిచోట్ల కీలక అధికారులు మామూళ్లకు అలవాటు పడి గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కీలక నిందితులను అదుపులోనికి తీసుకున్న అనంతరం అధికారులు రేపోమాపో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

మార్టూరులోను జోరుగా గంజాయి విక్రయాలు
మార్టూరులోనూ గత పదేళ్లుగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కొందరు కింది స్థాయి సిబ్బంది సహకారం ఉండటంతో దాడులు జరగడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాజమండ్రి ప్రాంతం నుంచి మార్టూరు నిత్యం వస్తున్న చేపలలోడు లారీలలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు   సమాచారం. స్థానిక పంచాయతీరాజ్‌ గెస్ట్‌ హౌస్‌ వెనుక ఉన్న ప్రాంతంలో గంజాయి విక్రయాలు కుటీర పరిశ్రమగా విస్తరించింది. స్థానిక నేతాజీ నగర్‌ కాలనీ సమీపంలోనూ జోరుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రానైట్‌ కార్మికులు, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని గంజాయి వ్యాపారం ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top