ఉలిక్కిపడ్డ తెలంగాణ, ఎవరీ శారదక్క?  

Maoists kill TRS MPTC: Who Is Saradhakka - Sakshi

 టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ సభ్యుడి హత్యతో కలకలం 

 రాష్ట్రంలో పట్టు సాధించేందుకు మావోయిస్టుల యత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని తూర్పు అటవీ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యు డు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హత్య చేయడంతో కలకలం రేగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు ఓ ప్రజాప్రతినిధిని చంపడం ఇదే తొలిసారి. పోలీసులు  ముఖ్యంగా తూర్పు తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేయడంతోపాటు నిరంతరం కూంబింగ్‌లు జరుపుతూ మావోయిస్టుల కార్యకలాపాలు నివారించగలిగారు. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలతో మావోయిస్టులు కలకలం సృష్టించారు. 

తెలంగాణలో తిరిగి పట్టు సాధించే ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే పార్టీ సెంట్రల్‌ కమిటీ.. తెలంగాణలో కార్యకలాపాలను హరిభూషణ్‌కు అప్పగిం చినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం ఏజెన్సీ, ఏటూరునాగారం ఏజెన్సీ పరిధిలో కొత్త కమిటీలు కూడా వేశారు. గతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ ఉండ గా, కొత్తగా వెంకటాపురం–వాజేడు కమి టీని నియమించారు. జూన్‌ ఆఖరి వారంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వేప నారాయణ అలియాస్‌ హరిభూషణ్, మరో నేత బడే చొక్కారా వులతోపాటు 20 మంది మావోయిస్టులు తెలంగాణలో ప్రవేశించారని నిఘావర్గాలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఇంతలోనే మావో యిస్టులు శ్రీనివాసరావును హత్య చేశారు. 

చదవండిఇన్‌ఫార్మర్‌ నెపంతో చంపేశారు

ఎవరీ శారదక్క?
శ్రీనివాసరావు మృతదేహం వద్ద పార్టీ కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు ఓ లేఖ వదిలి వెళ్లారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కొత్తగూడ మండలం గంగారం గ్రామానికి చెందిన శారద (40) హరిభూషణ్‌ భార్య. ఆమెను జజ్జరి సమ్మక్క అలియాస్‌ సారక్క, అలియాస్‌ శారదగా పిలుస్తారు. జూన్‌ ఆఖరిలో వారంలో హరిభూషణ్‌తోపాటు శారద కూడా తెలంగాణలోకి వచ్చిందన్న పోలీసుల అనుమానాలు తాజా ఘటనతో నిజమయ్యాయి. 

కోటేశ్వరరావు రాకతో పెరిగిన దూకుడు
మావోయిస్టు పార్టీ బాధ్యతలను నంబాల కోటేశ్వరరావు తీసుకున్నప్పటి నుంచి దూకుడు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు వరస దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న బీజేపీ ఎమ్మెల్యే బీమా మండవితోపాటు నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్నారు. మే ఒకటో తేదీన గడ్చిరోలిలో పోలీసు కాన్వాయ్‌ మీద దాడి చేయడంతో 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top