భార్య నిర్లక్ష్యం చేస్తోందని..  | Man killed his wife and suicide | Sakshi
Sakshi News home page

భార్య నిర్లక్ష్యం చేస్తోందని.. 

Nov 15 2017 1:30 AM | Updated on Nov 6 2018 8:08 PM

Man killed his wife and suicide - Sakshi

సత్తమ్మ, ఉప్పలయ్య(పైల్‌)

మద్దూరు: భార్య తనను నిర్లక్ష్యం చేస్తోందనే కోపంతో నిద్రలో ఉండగానే గొడ్డలితో నరికి చంపాడో భర్త. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనందదాసు ఉప్పలయ్య (65), సత్తమ్మ (60) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ముగ్గురినీ సత్తమ్మ తన పుట్టింట్లో ఉంచింది. తరచూ వారిని చూసే నిమిత్తం జనగామ జిల్లా నర్మెట్టలోని తల్లిగారింటికి వెళ్తుండేది. తన బాగోగులు చూడకుండా, మద్యానికి డబ్బులు ఇవ్వకుండా సత్తమ్మ తనను నిర్లక్ష్యం చేస్తోందని కక్షగట్టిన ఉప్పలయ్య పలుమార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా పెట్టించాడు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యాభర్తలు ఇదే విషయమై గొడవపడ్డారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి దాటాక ఉప్పలయ్య.. నిద్రలో ఉన్న సత్తమ్మను గొడ్డలితో నరికి చంపాడు. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న పెద్ద కుమారుడికి ఫోన్‌ చేసి హత్య విషయం చెప్పాడు. తాను కూడా చనిపోతున్నానని చెప్పాడు. అనంతరం ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. అనుమానం వచ్చిన కుమారుడు భాస్కర్‌ వెంటనే బండనాగం గ్రామంలో ఉండే తన బావమరిదికి ఫోన్‌ చేసి వెంటనే తన ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు.

అతను రాత్రి ఒంటిగంటకు  ధర్మారం వచ్చి ఇంటి తలుపు తీసి చూడగా, దంపతులు ఇద్దరూ వేర్వేరు గదుల్లో రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. మొదట భార్యను గొడ్డలితో నరికి, అనంతరం తాను బ్లేడుతో గొంతు కోసుకుని ఉప్పలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కుమారుడు ఆనందదాసు భాస్కర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చేర్యాల సీఐ చంద్రశేఖర్‌గౌడ్, మద్దూరు ఎస్‌ఐ ఎన్‌.విజేందర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement