ఏటీఎంల ఇన్‌ఛార్జే దొంగ..

Man Arrested In Kotak Bank ATM Robbery Case At Hyderabad - Sakshi

ఏటీఎం లూటీ కేసులో   నిందితుడి అరెస్టు    

నేరేడ్‌మెట్‌ : కోటక్‌ మహేంద్ర బ్యాంకు ఏటీఎం లూటీ కేసులో సీసీ కెమెరా ‘ఇంటి దొంగ’ను పట్టించింది. కుషాయిగూడ పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుషాయిగూడ ఏసీపీ కష్ణమూర్తితో కలిసి మల్కాజిగిరి డీసీపీ సీహెచ్‌.ఉమామహేశ్వర శర్మ కేసు వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లాకు చెందిన తూడి విఘ్నేష్‌(28) 15ఏళ్లుగా కీసర మండలం నాగారంలో నివసిస్తున్నాడు. ఐదేళ్లుగా కోటక్‌ మహేంద్ర గ్రూప్‌లో మల్కాజిగిరి రూట్‌లో క్యాష్‌ కస్టోడియన్‌తో పాటు రూట్‌ ఇన్‌చార్జిగా పని చేస్తున్నాడు.  ఇటీవల విఘ్నేష్‌కు కుషాయిగూడ–ఈసీఐఎల్‌ రూట్‌ కోటక్‌ మహేంద్ర బ్యాంకు ఏటీఎంల ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. తన సంపాదన కుటుంబ పోషణకు సరిపోవడం లేదనే అసంతృప్తితో ఉన్న విఘ్నేష్‌..  విలాసవంతంగా బతకాలని భావించాడు. ఇందుకు ఏటీఎంలో నగదు చోరీ చేయాలని పథకం వేశాడు.

ఇందులో భాగంగా ఈ నెల 9న కుషాయిగూడ ఠాణా పరిధిలోని కమలానగర్‌ (ఈసీఐఎల్‌ ప్రధాన రోడ్డు)లోని ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎం తాళాన్ని పగులకొట్టి, అందులోని సుమారు రూ.3,54,500 నగదును దోచుకెళ్లాడు. ఇంటికెళ్లి ఒక బ్యాగ్‌లో డబ్బును దాచిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా విధులకు హాజరయ్యాడు. ఏటీఎంలో నగదు రావడం లేదని బ్యాంకు అధికారులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయమై అధికారులు ఏటీఎంను సందర్శించగా చోరీ జరిగినట్టు తేలింది. ఈ నెల 11న అధికారులు కుషాయిగూడ పోలీసులకు చోరీ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏటీఎం కేంద్రం వద్ద సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా ఏటీఎం నుంచి నగదు చోరీ చేసింది క్యాష్‌ కస్టోడియన్‌ విఘ్నేష్‌గా తేలింది. బుధవారం నిందితుడిని అరెస్టు చేసి, ఇంట్లో దాచిపెట్టిన రూ.3,54,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో కుషాయిగూడ డీఐ రాములు, సీఐచంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

                       

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top