
సాక్షి బెంగళూరు: ఐటీ దాడుల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐటీ శాఖ అధికారులు గత మూడు రోజులుగా పరమేశ్వర్ ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పరమేశ్వర్ సన్నిహితుడు, పీఏ రమేశ్ ఇంటిలో కూడా సోదాలు చేపట్టారు. ఈ సోదాల నేపథ్యంలో ఆయన శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని జ్ఞాన భారతి విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. అంతకుముందు తన ఇద్దరు స్నేహితులకు రమేశ్ ఫోన్ చేసి ‘నేను పేదవాడిని, నాపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టింది. ఎంతో నిజాయితీగా బతికాను. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. వారి ప్రశ్నలను ఎదుర్కోలేను’ అని చెప్పినట్లు తెలిసింది.