చంపేశారయ్యా... 

The Infant Death At Ananthapuram General Hospital Caused Tension - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం సర్వజనాస్పత్రిలో పసికందు మృతి ఉద్రిక్తతకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ చనిపోయిందని, బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేయాలంటూ మూడుగంటలపాటు ఆందోళనకు దిగారు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురానికి చెందిన నాగసులోచన రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో అడ్మిట్‌ అయ్యింది. ఓ వైద్యురాలు పరీక్షించగా వారాల ప్రకారం డెలివరీ డేట్‌ 17 అని తేలింది. దీంతో మరోసారి స్కానింగ్‌ రిపోర్టు తీసుకురావాలని సూచించారు.

ఈ నెల 18న స్కానింగ్‌ చేయగా డెలివరీ డేట్‌ 27న అని వచ్చింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం సులోచన నొప్పులు వస్తున్నాయని అని చెప్పడంతో వైద్యులు మరోసారి పరీక్షించారు. ఉదయం జెల్‌ అందించారు. సాయంత్రంలోపు ప్రసవం అవుతుందని చెప్పారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో లేబర్‌వార్డులోకి ఆమెను తీసుకెళ్లారు. బిడ్డ బయటకు వస్తూ, లోపలికి వెళ్తూ ఉండటంతో వైద్యులు ఎఫిషియాటమీ (రంధ్రం కట్‌ చేయడం) చేశారు.  7 గంటలకు డెలివరీ కాగా.. పుట్టిన ఆడబిడ్డలో ఎటువంటి స్పందనలు కనిపించలేదు. దీంతో బిడ్డ చనిపోయిందని వైద్యులు చెప్పారు.  

వాగ్వాదం  
పసికందు(ఆడ) చనిపోవడంతో తండ్రి వెంకటగోపాల్, అవ్వ మల్లమ్మ, కుటుంబ సభ్యులు మల్లికార్జున, ఓబులేసు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగన్నాథ్, ఆర్‌ఎంఓ, గైనిక్‌ వైద్యులతో వాగ్వాదానికి దిగారు. మీ నిర్లక్ష్యం కారణంగానే పసికందు చనిపోయిందని ఆరోపించారు. పురిటిశాల ముందు పసికందుతో బైఠాయించారు. పసికందు తలకు గాయమైందని, అలా ఎందుకయ్యిందంటూ వారు వైద్యులతో వాదనకు దిగారు. బిడ్డ పుట్టినప్పుడు రక్తపు మరకలు అవుతాయని వైద్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు వినలేదు. గంట క్రితం బాగుందని చెప్పి చనిపోయిన బిడ్డను చేతికిచ్చారంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top