నేనే నిందితుడిని..నేనే బాధితుడిని

 I am the Accused.. I am The Victim - Sakshi

కొందరు బడాబాబులు నన్ను ముంచేశారు

నేను కేవలం 78 మందికి మాత్రమే బాధ్యత వహించాలి

నేను బకాయి పడిన మొత్తం రూ.20 కోట్లకు మించి ఉండదు

నోట్ల రద్దు నుంచే పరిస్థితి మారింది

‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడిన ట్రేడ్‌ బ్రోకర్‌ టంకాల శ్రీరామ్‌

రాజాం: జిల్లాను ఓ కుదుపు కుదిపేసిన ట్రేడ్‌ వ్యవహారంలో నిందితుడు టంకాల శ్రీరామ్‌ ఎట్టకేలకు నోరు విప్పారు. ఆరు నెలల పాటు మౌనంగా ఉన్న శ్రీరామ్‌ శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. ట్రేడ్‌ వ్యవహారంలో తన వల్ల చాలా మంది నష్టపోయారని, తాను కూడా కొందరి వల్ల నష్టపోయానని చెప్పారు. ఈ వ్యవహారంలో తాను నిందితుడినే అయినా బాధితుడిని కూడా అని తెలిపారు. ఈ తప్పటడుగు వల్ల తన జీవితం మారిపోయిందని, కుటుంబ సభ్యులకు కూడా దూరం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

సన్నిహితుల సూచనతో..

తాను 2013–14 నుంచే షేర్‌ బిజినెస్‌ చేస్తున్నానని, ప్రారంభంలో మంచి లాభాలు కూడా వచ్చాయని, పెట్టుబడులు భారీగా రావడం వల్ల సకా లంలో ఇన్వెస్టర్లకు లాభాలు చూపించగలిగానని చెప్పారు. ఆ సమయంలో రాజాంలో కార్యాలయం ఉండేదని, తన వ్యాపారం కంటే అధికంగా పెట్టుబడులు వచ్చేవని, కొన్నింటిని తిరస్కరించానని తెలిపారు.

అయితే ఆ సమయంలో తన స్నేహితులు కొద్ది మంది షేర్స్‌తో ఇతర వ్యాపారాలు చేయవచ్చని సూచించారని, వారి ఒత్తిడి మేరకే అధిక పెట్టుబడులు తీసుకోవాల్సి వచ్చిం దని చెప్పారు. ఈ డబ్బు వృథాగా ఖర్చవుతూ ఉండేదని, దాన్ని తగ్గించడానికి సంతకవిటి మం డలం తాలాడ వద్ద సొంతంగా భవనాన్ని నిర్మిం చి, పరిశ్రమల కోసం బ్యాంకు లోన్‌లకు దరఖాస్తు చేసుకున్నానని వివరించారు.

భూములు కూడా కొనడానికి సిద్ధంగా ఉన్న సమయంలో తనతోనే తిరుగుతున్న కొందరు తాము పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారని, అంతటితో ఆగకుండా అమాయకుల వద్ద తన పేరుతో డబ్బు తీసుకుని, తనకు తెలీకుండా దోచేశారని ఆరోపించారు. ఈ విషయాలు తనకు తెలీసే సరికి పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారు.

ఐపీ ఆలోచనే లేదు..

తన వద్ద ఆరంభంలో రూ. 100 కోట్ల వరకూ పెట్టుబడులతో లావాదేవీలు జరిగేవని శ్రీరామ్‌ ‘సాక్షి’కి తెలిపారు. మోసం చేయాలనుకుంటే ఇం త పెద్ద మొత్తంలో లావాదేవీలు ఉన్న సమయంలోనే తాను కంపెనీ ఎత్తివేసి ఉండేవాడినని, అలా కాకుండా వ్యాపారాన్ని వృద్ధి చేయడంతో పాటు బ్యాంకు లోన్‌ల ద్వారా వేరే పరిశ్రమలు ప్రారంభించి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పా టు తాను కూడా మరికొంచెం ముందుకు వెళ్లాలని అనుకున్నానని తెలిపారు.

అయితే నవంబర్‌ 2016లో వచ్చిన నోట్లు రద్దు ఈ పరిస్థితిని మార్చేసిందని, అప్పటి నుంచి పెట్టుబడులు నిలిచిపోయాయని అన్నారు. ఇదే అదనుగా తన చుట్టూ తి రుగుతున్న 23 మంది బడాబాబులు తమ డబ్బును బ్లాక్‌ మెయిల్‌ చేసి వెనక్కు తీసుకోవడంతో పాటు కొత్త పెట్టుబడిదారులను వెతికి తనకు తెలియకుండా తన పేరుతో వసూళ్లు చేశారని ఆరోపించారు. తాను ఇచ్చిన చెక్‌లు కూడా కొన్ని నకిలీవే ఉంటాయని అన్నారు. 

ఓ వైపు బ్యాంకు లోన్‌లు మంజూరు కాకపోగా, మరో వైపు నిరుపేదలు బలికావడం మనసు కలిచివేసిందని అన్నా రు. తన వద్ద పెట్టుబడులు పెట్టిన నిరుపేదలకు ఎలాగైనా డబ్బులు ఇచ్చేద్దామని అనుకుని రూ. 20 కోట్లు అప్పు చేయడానికి ప్రయత్నిస్తే, కొం దరు బడాబాబులు అడ్డుకున్నారని చెప్పారు. చేసేదేమీ లేక చివరి నిమిషంలో కొంతమంది తప్పుడు వ్యక్తుల సలహాలు తీసుకుని ఐపీకి సిద్ధపడ్డానని, ఈ ఐపీ తర్వాత కూడా పెట్టుబడులు పెట్టిన పేదలకు న్యాయం చేయాలని అనుకున్నానని అన్నారు. అయితే పరిస్థితి వికటించి తాను అరెస్టు అయ్యే వరకూ వచ్చిందని తెలిపారు. 

పోలీసులకు అంతా చెప్పా..

తాను దివాలా తీసే సమయంలో తన వద్ద వాస్తవ పెట్టుబడులు రూ. 20 నుంచి రూ.25 కోట్లకు మిం చిలేవని శ్రీరామ్‌ అన్నారు. కేవలం 78 మందికి మాత్రమే తాను న్యాయం చేయాల్సి ఉందని అన్నారు. తన వద్ద అక్రమ మార్గంలో డబ్బులు దోచేయడంతో పాటు, తన పేరుతో డబ్బులు దోచుకున్న 23 మంది పేర్లు తన వద్ద ఉన్నాయని, ఈ వివరాలు అన్నీ పోలీసుల ముందు పెట్టానని శ్రీరామ్‌ అన్నాడు. కేసు ముందుకు వెళ్తే గ్యారంటీగా తనతో పాటు నష్టపోయిన వారందరికీ న్యా యం జరుగుతుందని, బాధితులు సహకరించాలని కోరారు.  

బడాబాబుల హడావుడే... 

వాస్తవంగా తన వద్ద పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులు ముందు రోడ్డు మీదకు రాలేదని, తన వద్ద పెట్టిన పెట్టుబడుల కంటే అధికంగా దోచుకున్న బడాబాబులు హడావుడి చేయడంతో పాటు తనను నిందితున్ని చేశారని శ్రీరామ్‌ తెలిపాడు. తాను బయటకు వచ్చి వీటిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండగా, అవకాశం లేకుండా దారులన్నీ మూసేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తనపై మరిన్ని అభాండాలు వేసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. దర్యాప్తులో నిజం బయటపడుతుందని తెలిపాడు. 

ప్రస్తుతం పైసా కూడా లేదు..

ప్రస్తుతం నీ వద్ద ఉన్న డబ్బు ఎంత అని ‘సాక్షి’ ప్రశ్నించగా తన వద్ద పైసా కూడా లేదని శ్రీరామ్‌ సమాధానమిచ్చాడు. అయితే బడాబాబులు అక్రమంగా సంపాదించిన డబ్బును బయటకు తీయడంతో పాటు పోలీసులు సీజ్‌ చేసిన తన ఆస్తులను విక్రయిస్తే రూ. 15 కోట్లకు పైబడి డబ్బు వస్తుందని అన్నారు. అసలైన బాధితులకు కొంతమేర న్యాయం చేయగలనని, మిగిలిన మొత్తాన్ని కూడా ఏదో ఒక రూపంలో చెల్లించేందుకు అవకాశం ఉందని  తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top