అమెరికాలో పూజారిపై దాడి

Hindu priest attacked near temple in US - Sakshi

జాతి విద్వేష ఘటనగా  పోలీసుల అనుమానం

న్యూయార్క్‌: అమెరికాలో ఓ హిందూ పూజారిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని ఫ్లోరల్‌ పార్క్‌ సమీపంలో జూలై 18న ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం) స్వామి హరీశ్‌ చంద్ర పురీ అనే పూజారిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో ఆయన గాయాలపాలయ్యారు. జాతి విద్వేషం కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన 52 ఏళ్ల సెర్గియో గోవియా అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఫ్లోరల్‌ పార్క్‌ సమీపంలోని గ్లెన్‌ ఓక్స్‌లో శివ శక్తి పీఠం ఉంది. అక్కడి దగ్గర్లోని రోడ్డుపై హరీశ్‌ చంద్ర పూజారి వేష ధారణలోనే నడుచుకుంటూ వెళ్తుండగా, సెర్గియో వెనుక నుంచి వచ్చి హరీశ్‌ చంద్రపై పిడిగుద్దులు కురిపించాడు.

ఆ దెబ్బలకు తాళలేక హరీశ్‌ చంద్ర ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ‘ఇది మా ప్రాంతం’ అని దాడి సమయంలో సెర్గియో అరిచినట్లు హరీశ్‌ చంద్ర పురీ చెప్పారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన నలుగురు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్లు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలని అన్నారు. ఈ తర్వాతే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడిని ప్రతినిధుల సభలో సభ్యురాలైన గ్రేస్‌ మెంగ్‌ ఖండించారు. అమెరికాలో అల్పసంఖ్యాకులైన హిందువులకు తాను అండగా ఉంటాననీ, వివిధ దేశాల నుంచి వచ్చిన అనేకమంది మైనారిటీలు తన నియోజకర్గంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top