బ్యాంకుకు హ్యాకర్ల భారీ షాక్‌.. 94 కోట్లు లూటీ!

Hackers Withdraw 94 crores from Cosmos Bank In Pune - Sakshi

సాక్షి, పుణె: దేశంలో సైబర్‌ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బ్యాంక్‌ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు మరో అరాచకానికి పాల్పడ్డారు. తాజాగా ఏకంగా బ్యాంక్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసి కోట్లు లూటీ చేశారు. ఈ ఘటన దేశ ఆర్థిక​ రాజధాని ముంబైకి దగ్గరగా ఉండే పుణెలో జరిగింది. దేశంలోనే పేరుమోసిన కాస్మోస్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ను మాల్‌వేర్‌ సహాయంతో హ్యాక్‌చేసి దాదపు రూ. 94 కోట్లు దోచుకున్నారు. ఆలస్యంగా గుర్తించిన బ్యాంక్‌ అధికారులు చత్రుశింగి పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ కేసును స్థానిక పోలీసులు, సైబర్‌ క్రైం అధికారులు దర్యాప్తుచేస్తున్నారు.

అసలు విషయమేమిటంటే
ఈ నెల ఆగస్టు 11న హ్యాకర్లు మాల్‌వేర్ సాయంతో బ్యాంక్ కస్టమర్ల రూపే, వీసా కార్డుల వివరాలను సేకరించి క్లోన్ చేసి  దాదాపు 78 కోట్ల రూపాయలను గుర్తు తెలియని పన్నెండు వేల విదేశీ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అదే రోజు రెండున్నర కోట్లు స్వదేశీ అకౌంట్లకు బదీలీ చేశారు. ఆగస్టు 13న హాంగ్‌కాంగ్‌కు చెందిన బ్యాంక్‌ ఆకౌంట్లకు 13.92కోట్లు స్విఫ్ట్‌ పద్దతిన ట్రాన్స్‌ఫర్‌ చేశారని అధికారులు వివరించారు.  హాంగ్‌కాంగ్‌, స్విస్‌, భారత్‌ వేదికగా ఈ హ్యాక్‌ జరిగి ఉంటుందని సైబర్‌ క్రైం అధికారులు అనుమానం.

మీ డబ్బులు ఎటూ పోలేదు
కాస్మోస్‌ కోపరేటివ్‌ బ్యాంక్‌ హ్యాక్‌కు గురైందని తెలిసిన వెంటనే ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుహాస్‌ గోఖలే స్పందించారు. హ్యాక్‌ కు గురైంది బ్యాంక్‌ అకౌంట్లు మాత్రమేనని, ఖాతాదారుల వ్యక్తిగత అకౌంట్లు కాదని పేర్కొన్నారు. ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, మీ డబ్బులు ఎటూ పోలేదని భరోసా ఇచ్చారు. సైబర్‌ నేరగాళ్ల మరోసారి బ్యాంక్‌ సర్వర్‌ను హ్యాక్‌చేయడానికి ప్రయత్నం చేశారని కానీ బ్యాంక్‌ ఫైర్‌వాల్‌ సిస్టం సమర్థవంతంగా అడ్డుకుందని వివరించారు. ఓవరాల్‌గా మొత్తం ఎంత డబ్యు లూటీకి గురైందో బ్యాంక్‌ ఆడిట్‌లో స్పష్టంగా తెలస్తుందని గోఖలే తెలిపారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top