గౌరీలంకేశ్‌ని నేను చంపలేదు

Gauri Lankesh Murder Accused Change Voice In Court - Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, షూటర్‌ పరశురామ్‌ వాగ్మారే గురువారం మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు మాట మార్చాడు. ఇంతవరకు గౌరీలంకేశ్‌ను తుపాకీతో కాల్చి చంపింది తానే అని ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) ముందు తెలిపిన వాగ్మారే.. కాల్పులు జరిపింది తాను కాదని జడ్జి ముందు చెప్పడంతో సిట్‌ అధికారులు కంగుతిన్నారు.

సుమారు 9 నెలల పాటు గాలించి సిట్‌ అధికారులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో వాగ్మారేనే సిట్‌కు హత్యాక్రమాన్ని వివరించాడు. తానే కాల్పులు జరిపానని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలో అతన్ని జ్యుడిషియల్‌ కస్టడీపై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు పంపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 19వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ విచారణ జరిపారు. వాగ్మారే వాంగ్మూలమిస్తూ గౌరి హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఒక్కసారిగా తిరగబడ్డాడు. విచారణ అనంతరం వాగ్మారేకు కోర్టు జూలై 11 వరకు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది.

మరో నిందితునికి నార్కో పరీక్షలు
ఈ కేసులో మరో నిందితుడు కేటీ.నవీన్‌కుమార్‌కు నార్కో అనాలసిస్‌ పరీక్షలు జరపడానికి సిట్‌ న్యాయవాదులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. గౌరి హత్యకు ఉపయోగించిన తూటాలు, నిందితుడు చెబుతున్న పిస్టల్‌కు సరిపోలడం లేదని సిట్‌ చెబుతోంది. దీంతో నార్కో పరీక్షల ద్వారా అతని నుంచి సమాచారం రాబట్టాలని సిట్‌ నిర్ణయించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top