‘లాభం’ చూపించి లూటీ చేశారు!

Fraud with the name of Foreign Trading - Sakshi

నగర వైద్యుడికి ఎర

తొలుత రూ.50 లక్షలు పెడితే రూ.10 లక్షలు ‘లాభం’

ఆపై రూ.1.5 కోట్లు తీసుకుని టోకరా వేసిన వైనం

ఫారిన్‌ ట్రేడింగ్‌ పేరిట మోసం

నిందితుడిని సూరత్‌లో పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ఫారిన్‌ ట్రేడింగ్‌ పేరుతో ప్రక టనలు గుప్పించాడు. ఆకర్షితులైన వారు పెట్టిన పెట్టుబడులు, ‘లాభాలు’చూపించడానికి ఓ వెబ్‌సైట్‌ సృష్టించాడు. ఈ హంగామాతో నగరానికి చెందిన వైద్యుడు కొంత పెట్టుబడి పెట్టి వారంలోనే ‘లాభం’ పొందాడు. రెండోసారి ఏకంగా రూ.1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

ఈ మొత్తం కాజేసి టోకరా వేసిన నిందితుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు గురువా రం సూరత్‌లో పట్టుకున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నగరానికి చెందిన వైద్యుడు దినేశ్‌ను వాట్సాప్‌లో వచ్చిన ఓ ప్రకటన ఆకర్షించింది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో ఉన్న తమ సంస్థ ద్వారా ఫారిన్‌ ట్రేడింగ్‌ చేయడానికి ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫోన్‌ నంబర్‌ కూడా ఉంది.  

వారంలోనే రూ.10 లక్షలిచ్చాడు...
దీనికి ఆకర్షితుడైన దినేశ్‌ ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌కు సంప్రదించాడు. ముంబైకి చెందిన అలీ షేక్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడాడు. తమ వద్ద పెట్టుబడి పెడితే అంతర్జాతీయ షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతామని, డాలర్, యూరోల విలువతో పాటే ఇది పెరుగుతుందం టూ నమ్మబలికాడు. దినేశ్‌ తొలుత రూ.50 లక్ష లు పెట్టుబడి పెట్టాడు. ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించిన అలీ షేక్‌... వైద్యుడి పేరుతో ఖాతా తెరిచాడు.

రూ.50 లక్షలు ఫారెన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టినట్లు, దాని విలువ డాలర్, యూరో విలువతో పాటే మారుతున్నట్లు చూపించాడు. అలాగే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను వైద్యుడికి ఇచ్చి చూసుకునే అవకాశం ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన వారంలోనే 10లక్షలు లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లోని ఖాతా ద్వారా వైద్యుడికి తెలిసేలా చేశాడు. ఇది చూసిన దినేశ్‌ ఆ మొత్తం తనకు బదిలీ చేయాలని కోరడంతో అలీ షేక్‌ మొత్తం రూ.60లక్షలూ దినేశ్‌కు పంపాడు.  

ఈసారి రూ.కోటిన్నర పెట్టుబడి...
వారంలో రూ.10లక్షలు లాభం రావడంతో వైద్యుడు అలీ మాయలో పూర్తిగా పడిపోయాడు. ఇది నిర్ధారించుకున్న అలీ అసలు కథ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ లాభాల బాటలో ఉందని, ఈసారి మరింత లాభం వచ్చే అవకాశం ఉందంటూ ఎర వేశాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి తీసుకున్నది కలిపి మొత్తం రూ.1.5కోట్లు దినేశ్‌ పెట్టుబడిగా పెట్టా డు.  డబ్బు కోసం దినేశ్‌ ఎంతగా ప్రయత్నించినా అలీ నుంచి సరైన స్పందన రాలేదు.

దీంతో మోసపోయానని గుర్తించి సీసీఎస్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఈ మోసానికి పాల్పడింది అలీ షేక్‌గా చెప్పుకున్న అమీర్‌ ఆరిఫ్‌ అగాడీగా తేల్చారు. అతడు ఉండేది ముంబై కాదని, గుజరాత్‌లోని సూరత్‌ అని నిర్ధారించారు. దీంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్‌ వారంట్‌పై సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top