‘పెట్రోల్‌ దాడి’ ఘటనపై దర్యాప్తు వేగవంతం | Four Members Died in Petrol Attack Incident East Godavari | Sakshi
Sakshi News home page

‘పెట్రోల్‌ దాడి’ ఘటనపై దర్యాప్తు వేగవంతం

Jan 24 2020 12:50 PM | Updated on Jan 24 2020 12:50 PM

Four Members Died in Petrol Attack Incident East Godavari - Sakshi

అంత్యక్రియల నిర్వహణ కోసం మృతదేహాలను వ్యాన్‌లో తరలిస్తున్న దృశ్యం

తూర్పుగోదావరి,కడియం: మండలంలోని దుళ్ల ముదిరాజుల పేటలో నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ స్వయంగా కేసును పర్యవేక్షిస్తుండడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడిగా భావిస్తున్న మాసాడ శ్రీను నివాసం ఉంటున్న తిరుపతికి ప్రత్యేక బృందం చేరుకుని అతడి బంధువులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిందితుడుతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. పెట్రోల్‌ బంకు వద్ద సీసీ టీవీ ఫుటేజీలను బట్టి ఇది తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఎవరన్న దిశలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 17న తన మేనత్తపై దాడి సమయంలో శ్రీను కూడా మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తి కోసం కూపీలాగుతున్నారు. అలాగే బాధితులు, నిందితుల బంధువులు, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.

గొళ్లెం పెట్టడమే కీలకం..
నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి, ఆ గది తలుపులకు బయట వైపు గొళ్లెం పెట్టడంపై ప్రస్తుతం పోలీస్‌లు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ గదితో పాటు పక్కనే ఉన్న ఇంటి యజమాని గదికి కూడా గొళ్ళెం పెట్టారు. 17వ తేదీన కూడా మేనత్త సత్యవతిపై దాడి సమయంలో ఇదే విధంగా యజమాని నిద్రపోతున్న గదికి మాసాడ శ్రీను గొళ్లెం పెట్టి, గొడవకు సిద్ధమైనట్టు తెలిసింది. పెట్రోల్‌ దాడి ఘటనలో కూడా అదే విధంగా తలుపులకు గొళ్లెం పెట్టడంతో నిందితుడు మాసాడ శ్రీనుగానే పోలీస్‌ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అలాగే పెట్రోల్‌ బంకులో వంద రూపాయల పెట్రోల్‌ను ప్లాస్టిక్‌ సీసాలో పోయించుకున్నప్పుడు మరో వ్యక్తి మోటారు సైకిల్‌పై ఉన్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. 17న దాడి సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులే వచ్చారు. తలుపులకు గొళ్లెం పెట్టడం, ఇద్దరు వ్యక్తులు ఉండడం, దాడికి కొద్ది సేపటి ముందే సీసాలో పెట్రోలు పోయించుకోవడం వంటి విషయాలను గమనిస్తే మాసాడ శ్రీనే నిందితుడై ఉండొచ్చని బలంగా విశ్వసిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మూడు రోజులు మృత్యువుతో పోరాడి..
రాజమహేంద్రవరం క్రైం: కాలిన గాయాలతో మూడు రోజులు గా నరకయాతన అనుభవించి, మృత్యువుతో పోరాడి మరో మహిళ మృతి చెందింది. దుళ్ల గ్రామంలో ఉన్మాది ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన సంఘటనలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంటా దుర్గా భవాని(23) మృతి చెందింది.  ఈ సంఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

పాపం చిన్నారులు
కళ్ల ముందే చెల్లెలు విజయలక్ష్మి, మేనమామ కోట్ని రాము అగ్నికి ఆహుతి కాగా బియ్యం పెట్టె చాటున దాక్కొని స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయట పడిన గంటా ఏసు కుమార్, గంటా దుర్గా మహేష్‌లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలతో విలవిల్లాడుతున్నారు. తల్లి, చెల్లి, అమ్మమ్మ, మేనమామ ఇలా నలుగురినీ ఒకేసారి కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తల్లి చనిపోయిందనే సమాచారం ఆ చిన్నారులకు బంధువులు చెప్పకపోవడంతో ఆమె రాకకోసం వారు బెంగగా ఎదురు చూస్తున్నారు.

కుటుంబ సభ్యులకుమృతదేహాలు అప్పగింత
ఈ సంఘటనలో మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు కోట్ని సత్యవతి భర్త అప్పారావు(నిందితుడిని పట్టుకునేందుకు ఆచూకీ కోసం పోలీసులు తిరుపతి తీసుకువెళ్లారు.) అందుబాటులో లేకపోవడంతో అల్లుడు గంటా భద్రరాజు మామతో ఫోన్‌లో మాట్లాడి సత్యవతి, దుర్గా భవానీల మృతదేహాలకు రోటరీ కైలాస భూమికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు అయిన ఖర్చును వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి బాధితులకు అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement