అనుమానంతో అమానుషం

Five Members Arrest In Harrasments Murder Case Hyderabad - Sakshi

మెకానిక్‌ను దొంగగా భావించిన ‘పార్కింగ్‌’ నిర్వాహకులు

 లారీకి తలకిందులుగా కట్టి ‘ఇంటరాగేషన్‌’ చేసిన ఐదుగురు వ్యక్తులు

చిత్రహింసలు తాళలేక మృతి నిందితుల అరెస్టు  

నిందితుల్లో హోంగార్డుతో పాటు హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు

సాక్షి, సిటీబ్యూరో: లంగర్‌హౌస్‌ నేతాజీ నగర్‌లోని పార్కింగ్‌ లాట్‌... దాని మధ్య నుంచి రహదారి వెళ్తుంది... లాట్‌ నిర్వాహకులతో పాటు వారి స్నేహితులు ఈ నెల 21న రాత్రి ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపారు.. భయంతో ఒకరు పారిపోగా, మరొకరు వారికి దొరికేశారు... మెకానికైన అతడిని దొంగగా అనుమానించిన దుండగులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు... లారీ వెనుక తలకిందులుగా కట్టేసి కర్రలు, రాడ్లతో ‘ఇంటరాగేషన్‌’ చేశారు... తెల్లవారే వరకు అదే స్థితిలో ఉండిపోయిన మెకానిక్‌ ప్రాణాలు విడిచాడు.. ఈ కేసులో ఆరుగురు నిందితులను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో ఓ హోంగార్డుతో పాటు మరో హెడ్‌–కానిస్టేబుల్‌ కుమారుడు ఉన్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. రాజేంద్రనగర్‌కు చెందిన పటేల్‌ అనే వ్యక్తికి నేతాజీనగర్‌ వద్ద ఎకరం ఖాళీ స్థలం ఉంది. దీని మధ్య నుంచి నేతాజీనగర్‌కు వెళ్ళే రహదారి ఉంది. పటేల్‌ అందులో ఓ పార్కింగ్‌ లాట్‌ నిర్వహిస్తుండగా, టోలిచౌకికి చెందిన అబ్దుల్‌ షుకూర్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.

అదే ప్రాంగణంలో షెడ్‌ నిర్వహిస్తున్న మెకానిక్‌ మహ్మద్‌ సజ్జాద్‌ అలీ, నగర పోలీసు విభాగంలో డ్రైవర్‌గా పని చేస్తున్న హోంగార్డు మహ్మద్‌ హసన్, చికెన్‌ షాపు నిర్వహించే హెడ్‌–కానిస్టేబుల్‌ కుమారుడు అబ్దుల్‌ సయీద్, మహ్మద్‌ అల్తాఫ్, మహ్మద్‌ షర్ఫుద్దీన్‌ స్నేహితులు. వీరు తరచూ అక్కడే కూర్చుని మద్యం సేవించే వారు. ఈ నెల 21న రాత్రి వారు పార్కింగ్‌ లాట్‌లో జరుగుతున్న కూర్చుని చిన్న చిన్న చోరీలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో కార్వాన్, రామ్‌సింగ్‌పుర ప్రాంతానికి చెందిన కారు మెకానిక్‌ అజయ్‌ సింగ్‌ పని ముగించుకుని మరో వ్యక్తితో కలిసి నేతాజీ నగర్‌కు వెళ్తున్నాడు. వీరిని గమనించిన ఆరుగురూ ఆగాల్సిందిగా అరిచారు. దీంతో భయపడిన మరో వ్యక్తి పారిపోగా... అజయ్‌ సింగ్‌ వారికి చిక్కాడు. వారిలో షుకూర్‌ మినహా మిగిలిన ఐదుగురూ అతడిని దొంగగా భావించి నిలదీశారు.

కనీసం సమాధానం చెప్పే సమయం కూడా ఇవ్వకుండా సమీపంలోని లారీ వద్దకు తీసుకువెళ్లి తలకిందులుగా కట్టేశారు. ఇప్పటి వరకు తమ లాట్‌లో ఎన్ని చోరీలు చేశావంటూ కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అజయ్‌ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని అలాగే వదిలేసిన వారు ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం దీనిని గమనించిన  షుకూర్‌ అజయ్‌ని ఆస్పత్రికి తరలించి మిగిలిన వారికి సమాచారం ఇచ్చాడు. చికిత్స పొందుతూ అజయ్‌ మృతి చెందడంతో నిందితులు పరారయ్యారు. అజయ్‌ సోదరుడి ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్‌ ఠాణాలో కేసు నమోదైంది. నిందితుల కోసం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, వి.కిషోర్, ఎల్‌.భాస్కర్‌రెడ్డి తమ బృందాలతో గాలించి గురువారం గోల్కొండ ప్రాంతంలో వారిని అరెస్టు చేశారు. ఘటనాస్థలికి సమీపంలోని పొదల్లో పడేసిన మారణాయుధాలు రికవరీ చేశారు. నిందితుల్లో హోంగార్డు హుస్సేన్, హెడ్‌–కానిస్టేబుల్‌ కుమారుడు అబ్దుల్‌ సయీద్‌లపై గతంలో హత్యాయత్నం కేసు ఉంది. ఈ వివరాలను ఉన్నతాధికారులకు సమర్పించి హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top