పోర్టులో మరో క్రేన్‌ దగ్ధం 

Fire Accident In Vizag Port - Sakshi

నెలరోజుల వ్యవధిలో విశాఖ పోర్టులో ఇలా వరుసగా మూడు ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి ప్రమాదంలో హెచ్‌పీసీఎల్‌ అద్దెకు తీసుకున్న టగ్‌ కాలిపోగా.. రెండో ప్రమాదంలో పీపీపీ పద్ధతిలో పోర్టులో పనులు నిర్వహిస్తున్న సీపోల్‌ కంపెనీకి చెందిన భారీ క్రేన్‌ మంటల పాలైంది. తాజాగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అదే సీపోల్‌ కంపెనీకి చెందిన మరో భారీ మొబైల్‌ క్రేన్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటన క్యూ7 బెర్త్‌పై జరిగినా.. రెండు ప్రమాదాలకు కారణం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూటేనని చెబుతున్నారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా.. వాటికి కారణాలేమిటన్నది పోర్టు గానీ.. సంబంధిత సంస్థలు గానీ వెల్లడించడం లేదు. 

ఆగస్టు 12.. ఔటర్‌ హార్బర్‌లో ఉన్న భారీ నౌకలో నిర్వహణ పనులకు సిబ్బందిని తీసుకెళ్లిన టగ్‌ మంటల బారిన పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఒకరు గల్లంతయ్యారు.
ఆగస్టు 26.. ఇన్నర్‌ హార్బర్‌ క్యూ1 బెర్త్‌పై నౌక నుంచి ఎరువులు అన్‌లోడ్‌ చేస్తున్న హార్బర్‌ మొబైల్‌ క్రేన్‌ దగ్ధమై భారీ నష్టం వాటిల్లింది.
సెప్టెంబర్‌ 9.. ఇన్నర్‌ హార్బర్‌ క్యూ7 బెర్త్‌పై నౌక నుంచి ఎరువులు అన్‌లోడ్‌ చేస్తున్న మరో హార్బర్‌ మొబైల్‌ క్రేన్‌ పూర్తిగా కాలిపోయింది.

సాక్షి, విశాఖపట్టణం : పోర్టులో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించి మొబైల్‌ క్రేన్‌ పూర్తిగా దగ్ధమైపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1 గంట సమయంలో డబ్ల్యూక్యూ – 7 బెర్త్‌ మీద నిలిపి ఉంచిన లీబెర్ర్‌ మేకింగ్‌ హార్బర్‌ మొబైల్‌ క్రేన్‌ (హెచ్‌ఎంసీ) పూర్తిగా దగ్ధమయ్యింది. వివరాల్లోకి వెళ్తే... పీపీపీ పద్ధతిలో పోర్టులో పనులు నిర్వహిస్తున్న సీ పోల్‌ కంపెనీకి చెందిన హార్బర్‌ మొబైల్‌ క్రేన్‌ (హెచ్‌ఎంసీ) ఇన్నర్‌ హార్బర్లోని డబ్ల్యూక్యూ – 7 బెర్త్‌ మీద నిలిపి ఉంచిన ఎం.వి.ఎస్‌.ఫాల్కన్‌ సిలో డి ఫ్రాన్సిస్‌కో నౌక నుంచి డీఏపీ (యూరియా)ను అన్‌లోడ్‌ చేస్తుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1 గంటకు మొబైల్‌ క్రేన్‌ ఇంజిన్‌ రూం (కేబిన్‌)లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన డ్రైవరు క్రేన్‌ను నౌకకు దూరంగా తీసుకెళ్లి సురక్షితంగా కిందకు దిగిపోయాడు. లేకుంటే నౌకకూ ప్రమాదం సంభవించేది.

పోర్టు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో క్రేన్‌ ఇంజిన్‌ రూం పూర్తిగా కాలిపోయింది. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ఇంజిన్‌ రూంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని, అగ్ని ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని పోర్టు యాజమాన్యం తెలిపింది. ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. మంటలను అదుపుచేసిన తరువాత యధావిధిగా డబ్ల్యూక్యూ – 7 బెర్త్‌మీద కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం బెర్త్‌ వద్ద సాధారణ పరిస్థితి నెలకొంది. అయితే ప్రమాదంలో సుమారు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

అసలేం జరుగుతోంది..?
పోర్టులో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అవుటర్‌ హార్బర్‌లో హెచ్‌పీసీఎల్‌కు చెందిన నిర్వహణ టగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన ఘటన సంచలనం రేపింది. అది మరువకముందే గత నెల 26న పోర్టు డబ్ల్యూక్యూ – 1 బెర్త్‌ మీద నిలిపి ఉంచిన మొబైల్‌ క్రేన్‌ (ఎంఈఎల్‌ లీబెర్ర్‌ 400) కేబిన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ సంఘటన మరువకముందే ఆదివారం అర్ధరాత్రి మరో మొబైల్‌ క్రేన్‌ దగ్ధమైపోయింది. అయితే వరుసగా మొబైల్‌ క్రేన్‌లు దగ్ధం కావడం వెనుక ఏదైనా కారణం ఉందా అన్న అనుమానాన్ని పోర్టు సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు.

భారీగా ఆస్తి నష్టం జరగడంతోపాటు ప్రాణ నష్టం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. పదిహేను రోజల వ్యవధిలో కోట్లాది రూపాయల విలువ చేసే భారీ క్రేన్‌లు తగలబడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. దీని వెనుక ఏదైనా కుట్ర దాక్కుందేమోనన్న ఆరోపణలు బలంగా పోర్టు ఆవరణలో వినిపిస్తున్నాయి. పోర్టు ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే కమిటీ వేసి నిజనిర్థారణ చేయాలని పోర్టు ఉద్యోగులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top