కూతురిపై అత్యాచారం.. తండ్రికి శిక్ష

Father Punished for Molestation on His Daughter In Nellore - Sakshi

లైంగికదాడి కేసులో వ్యక్తికి జీవితఖైదు  

సాక్షి, నెల్లూరు: కన్నకూతురిపై లైంగికదాడి చేసిన కేసులో తండ్రికి జీవితఖైదు విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్‌కుమార్‌ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. ఇందుకూరుపేట మండలానికి చెందిన చాంద్‌బాషా తన భార్య, ఐదుగురు పిల్లలతో నెల్లూరులోని హరనాథపురంలో కాలువకట్ట ప్రాంతంలో నివాసం ఉండేవాడు. అతను బేల్దారి పనులు చేసేవాడు. మద్యానికి బానిసైన చాంద్‌బాషా భార్యను వేధించడంతో ఆమె 2015 సంవత్సరం జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. బాషా మద్యం సేవించి మైనర్‌ అయిన తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. తరచూ ఆమెపై లైంగికదాడికి పాల్పడేవాడు.

చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని బాలికను అడగటంతో ఆమె విషయం చెప్పింది. వారి సలహా మేరకు 2015లో నవంబర్‌ 4వ తేదీన సొంత గ్రామానికి వెళ్లి అంగన్‌వాడీ టీచర్‌కు విషయం తెలపడంతో ఆమె సదరు బాలికను నెల్లూరు బాలసదన్‌కు తీసుకెళ్లింది. వారి సూచన మేరకు అదే నెల 7వ తేదీన నెల్లూరు 4వ నగర్‌ పోలీసులకు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ కేబీఎస్‌ మణి కేసు వాదించారు.

ఇద్దరికి ఏడేళ్ల జైలు
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌ బాలికపై లైంగికదాడి చేశారనే కేసులో నేరం రుజువు కావడంతో వెండి అలియాస్‌ రాగి భార్గవ్, జల్లి గోపి అనే ఇద్దరికి ఏడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రమేష్‌కుమార్‌ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. సంగం మండలంలోని ఓ గ్రామంలో  2016 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి భార్గవ్, గోపిలు బాలిక ఇంటికి వెళ్లారు. భార్గవ్‌ బాలికపై లైంగికదాడికి పాల్పడగా ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కల వారు రావడంతో భార్గవ్, గోపి అక్కడినుంచి పరారయ్యారు. బాలిక ఫిర్యాదు మేరకు సంగం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు అనంతరం ఇద్దరిపై కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ కేబీఎస్‌ మణి కేసు వాదించారు.      

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top