
సైదులు,లింగయ్య, మృతదేహాలు
చివ్వెంల(సూర్యాపేట) : రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దురాజ్‌పల్లికి చెందిన పల్స లింగయ్య(62) కల్లుగీత కార్మికుడిగా, అతని కుమారుడు సైదులు (38) సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా డు.
భూ సమస్యల పరిష్కారానికి చివ్వెంల తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం తండ్రి, కొడుకు బైక్‌పై వెళ్లారు. అనంతరం పని ముగించుకుని గ్రామానికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదుట రాంగ్ రూట్‌లో వస్తున్న గ్రామ శివారులోని హెచ్‌పీ ఆయిల్ ట్యాంకర్ బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇరువురు అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. మృతుడు లింగయ్యకు ముగ్గు రు కుమారులు, భార్య ఉండగా, కుమారుడు సైదులకు కుమారుడు, భార్య ఉన్నారు.
సర్వీస్ రోడ్డు లేకపోవడమే కారణమా?
దురాజ్‌పల్లి గ్రామంలో సర్వీస్ రోడ్డు లేకపోవడంతోనే వారంలో రెండుసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని జంక్షన్ వద్ద నుంచి నిత్యం మిర్యాలగూడ, హూజుర్‌నగర్, గరిడేపల్లికి వెళ్లే వాహనాలు జాతీయ రహదారి దాటే క్రమంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాపోతున్నారు.
దీనికితోడు కలెక్టరేట్‌కు వెళ్లాలన్నా రాంగ్ రూట్లోనే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. సర్వీస్ రోడ్డు నిర్మించినట్లయితే ప్రమాదాలను నివారించవచ్చునని స్థానికులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సర్వీస్ రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన లింగయ్య, సైదులు మృతదేహాలపై పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. కు టుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ బాషా, రామగిర నగేష్, పల్స ఉపేందర్, బొలికొండ సైదులు, రహిమత్ పాష, జాటోతు అంబాలి హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.