నకిలీ కమిషన్‌ వ్యాపారి అరెస్ట్‌

fake business man was arrested - Sakshi

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో లైసెన్సులు లేకుండా రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న నకిలీ కమీషన్‌ వ్యాపారిని మార్కెట్‌ అధికారులు శనివారం వల పన్ని పట్టుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బంజర గ్రామానికి చెందిన చెవిటి రాము, కొంతకాలంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కమీషన్‌ వ్యాపారిగా చెలామణవుతున్నాడు. రైతు పంటను దడవాయిలు కాంటా పెట్టి కాంటా చిట్టాల్లో నమోదు చేస్తారు. ఆ చిట్టా పుస్తకాలను మార్కెట్‌ కమిటీ లైసెన్స్‌డ్‌ దడవాయిలకు ఇచ్చి కాంటాలు పెట్టిస్తారు.

ఆ కాంటా పుస్తకాలకు ఇతడు నకిలీవి సృష్టించి మోసగిస్తున్నాడు. ఇతడిని జనవరి 3న పత్తి కొనుగోళ్లలో మార్కెట్‌ అధికారులు గుర్తించారు. అతడిని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీకు పర్సన్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌(జేసీ) టి.వినయ్‌కృష్ణారెడ్డి వద్ద హాజరుపరిచారు. జేసీ హెచ్చరించి వదిలేశారు. అయినప్పటికీ ఆ నకిలీ వ్యాపారి మళ్లీ వచ్చాడు. కామేపల్లి మండలం నెమిలిపురి గ్రామానికి చెందిన బన్సీలాల్‌ అనే రైతు నుంచి మిర్చి కొనుగోలు చేస్తూ ఫిబ్రవరి 28న మరోసారి పట్టుబడ్డాడు.

ఆ రైతును కాంటాల్లో మోసగించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. జేసీ ఆదేశాలతో ఆ నకిలీ వ్యాపారిని ఖమ్మం త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి నకిలీ కాంటా చిట్టా పుస్తకాలను, ఖమ్మంలోగల దుకాణం నుంచి డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నారు. ఇతడికి సహకరిస్తున్న నకిలీ గుమస్తా సుజిత్‌ను కూడా మార్కెట్‌ అధికారులు విచారిస్తున్నారు.  

మరో నకిలీ వ్యాపారి గుర్తింపు 
రాము మాదిరిగానే, మరో నకిలీ కమీషన్‌ వ్యాపారిని కూడా మార్కెట్‌ అధికారులు గుర్తించారు. ఇతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సమాచారం. మార్కెట్‌ సమీపంలోగల ఇతడి దుకాణాన్ని సీజ్‌ చేసేందుకు మార్కెట్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
చర్యలు తీసుకుంటాం 
ఈ నకిలీ కమీషన్‌ వ్యాపారులపై మార్కెట్‌ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని  జిల్లా మార్కెటింగ్‌ అధికారి రత్నం సంతోష్‌కుమార్‌ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇద్దరిని, వీరికి సహకరిస్తున్న వారిని గుర్తించామన్నారు. నకిలీ కాంటా చిట్టాలను ప్రింట్‌ చేస్తున్న వారిని కూడా గుర్తించినట్టు చెప్పారు. వీరిపై ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top