
సాక్షి,హైదరాబాద్:రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈఎస్‌ఐ ఆస్పత్రి ఔషధాల కుంభకోణం నిందితురాలు పద్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకురాలుగా విధులు నిర్వర్తిస్తోన్న పద్మను ఔషధాల కుంభకోణం కేసులో ఇటీవల ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పద్మ శనివారం సాయంత్రం చికిత్స కోసం ఇచ్చిన మాత్రలను పెద్ద మోతాదులో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని గమనించిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు.