
హుస్నాబాద్ రూరల్: అప్పటికే తీసుకున్న రూ.100 ఇవ్వకపోగా, మరో వంద అప్పు అడిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు మద్యం మత్తులో వృద్ధురాలిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మహ్మదాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరేశ్ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు ఊళ్లో చేపలు విక్రయిస్తుంటాడు. పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన రాజవ్వ(70) రూ. 100 ఇచ్చి చేపలు తీసుకురమ్మంది.
అప్పటి నుంచి అతను చేపలు తేక, ఇచ్చిన డబ్బులు తిరిగివ్వక తప్పించుకు తిరుగుతున్నాడు. సోమవారం రోడ్డుపై కలిసిన నరేశ్‌ను రాజవ్వ తన డబ్బుల కోసం నిలదీసింది. ఇప్పుడే వచ్చి ఇస్తానని వెళ్లిన నరేశ్.. మధ్యాహ్నం తప్పతాగి రాజవ్వ ఇంటికి వచ్చాడు. రూ.100 అప్పుగా ఇవ్వాలని అడిగాడు. తన డబ్బులు ఇవ్వకపోగా, మళ్లీ అప్పు అడుగుతుండటంతో రాజవ్వ అతనిని గట్టిగా మందలించింది. ఆగ్రహంతో ఊగిపోయిన నరేశ్.. ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు. బండరాయితో ఆమె తలపై బలంగా మోదాడు. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.