పెళ్లిళ్ల రాయుడు.. పురుషోత్తమన్‌

eight marriages purushothaman cheating  - Sakshi

57 ఏళ్లు.. 8 పెళ్లిళ్లు..

కోట్లాది రూపాయల మోసం

అన్నానగర్‌ (చెన్నై): అతడి పేరు పురుషోత్తమన్‌...తానో సచ్చీలుడిగా ప్రచారం చేసుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరిని.. అలా ఏకంగా ఎనిమిది మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఆపై వారి నుంచి కోట్లాది రూపాయాలు కాజేసి పరారైపోయాడు. పాపం పండడంతో పెళ్లిళ్ల బ్రోకర్లతో పాటు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరు వెళ్ళలూర్‌కి చెందిన పురుషోత్తమన్‌ (57) తనను పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుని భార్య మృతి చెందడంతో రెండో వివాహం చేసుకోదలిచినట్లు కోయంబత్తూరులోని ‘మెట్టిఒలి కళ్యాణ సమాచార కార్యాలయం’లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆ కార్యాలయాన్ని నడుపుతున్న మోహనన్‌ (65), అతని భార్య వనజాకుమారి (53)లు కుముదవల్లి (45) అనే మహిళ వద్ద పురుషోత్తమన్‌ గురించి గొప్పగా చెప్పారు.

కుముదవల్లి..పురుషోత్తమన్‌ని నేరుగా కలవగా తన భార్య మృతి చెందడం, కళాశాలలో చదువుతున్న కుమార్తె ఆలనపాలన చూసుకునేందుకే రెండో వివాహానికి సిద్ధమైనట్లు నమ్మబలకడంతో గతేడాది ఆగస్టులో పురుషోత్తమన్‌ను పెళ్లి చేసుకుంది. వ్యాపారంలో నష్టం వచ్చినట్లుగా మోసపూరిత మాటలు చెప్పి కుముదవల్లి నుంచి రూ.3 కోట్లు తీసుకుని పురుషోత్తమన్‌ పరారైయ్యాడు. అనుమానం వచ్చిన కుముదవల్లి అతడి గురించి ఆరాతీయగా కోయంబత్తూరుకు చెందిన సబితా, ఉషారాణి, శాంతి, సుశీల, చెన్నై అన్నానగర్‌కి చెందిన ఇందిరాగాంధీ, ఈరోడ్‌కు చెందిన చిత్ర సహా మొత్తం ఎనిమిది మంది మహిళలను వివాహం చేసుకుని కోట్లాది రూపాయలు కాజేసి వారిని మోసం చేసినట్లు తెలుసుకుంది. తండ్రి మోసాలకు కుమార్తె గీతాంజలి కూడా సహకరిస్తున్నట్లు తేలడంతో పోలీసులకు కుముదవల్లి ఫిర్యాదు చేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top