మల్టీలెవల్లో మోసం

EBiz Multi Level Online Cyber Crime In Hyderabad - Sakshi

ఆన్‌లైన్‌ కోర్సు ముసుగులో మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌  

కోర్సు కోసం విద్యార్థుల నుంచి రూ.16,821 వసూలు 

బాధిత విద్యార్థి ఫిర్యాదుతో వెయ్యి కోట్ల స్కాం వెలుగులోకి.. 

వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌  

సాక్షి, హైదరాబాద్‌: అతి తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చంటూ ‘ఈ–లెర్నింగ్‌’కోర్సుల పేర వలవేస్తారు. వలకు చిక్కిన వారిని నెమ్మదిగా మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌లోకి దింపుతారు. భారీగా కమిషన్లు వస్తాయంటూ ఆశచూపిస్తారు. ఎంత మందిని చేర్పించినా.. కమిషన్‌ మాత్రం చెల్లించరు. ఇలా లక్షల మంది నుంచి వందల కోట్లు వసూలు చేసింది ఈబిజ్‌.కామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. వీరి చేతిలో మోసపోయిన విద్యార్థి సమల్ల వివేక్‌ ఫిర్యాదుతో ఈ స్కాం బయటికొచ్చింది. దీంతో నోయిడాకు చెందిన ‘ఈబిజ్‌.కామ్‌’ప్రతినిధి హితిక్‌ మల్హాన్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మందిని ఈ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌లో చేర్చుకొని రూ.వెయ్యి కోట్ల వరకు మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితిక్‌ను నోయిడాలో అరెస్టు చేసి ట్రాన్సిట్‌ వారెంట్‌పై మంగళవారం నగరానికి తీసుకొచ్చారు. ఈ కంపెనీ బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న రూ.70.5 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. మల్హన్‌ ఫ్యామిలీ కనుసన్నల్లో నడుస్తున్న ఈ భారీ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసం వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు.  

రిటైల్‌ ప్రొడక్ట్స్‌తోనూ మోసాలు...  
ఇదిలా ఉండగా ఈ–లెర్నింగ్‌ కోర్సు వలలో పడిన వారిలో కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో ఫ్యాషన్‌పై వారికున్న అభిరుచిని డబ్బుగా మలచుకునేవారు. జీన్‌ పాయింట్లు, షర్ట్‌లు, టీషర్ట్‌లు, బెల్ట్‌లు అతి తక్కువ ధరకే ఇస్తామంటూ డబ్బులు కట్టించుకొనేవారు. నాసిరకం వస్తువులిస్తూ.. ఇందులో మరికొందరిని చేర్పిస్తే కమిషన్లు వస్తాయంటూ ఆశచూపేవారు. అలాగే ఒక్కొక్కరి నుంచి రూ.30 వేల చొప్పున ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామనేవారు. ఇలా అన్ని కలిపి లక్షల మందిని గొలుసు కట్టు పథకాల ద్వారా మోసగించినట్లు పోలీసు విచారణలో తేలింది. చాలా మంది విద్యార్థులు ఈ కంపెనీలో డబ్బులు పెట్టారని విచారణలో తేలింది. వరంగల్, ఆదిలాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కంపెనీ మోసాలపై కేసులు ఉన్నాయని సజ్జనార్‌ తెలిపారు. పరారీలో ఉన్న కంపెనీ ఎండీ, డైరెక్టర్లు పవన్‌ మల్హన్, అనిత మల్హన్‌ కోసం గాలిస్తున్నామన్నారు.  

డబ్బులొస్తాయని ఆశచూపారు... 
మా అన్నయ్య స్నేహితుడు 2 నెలలు గడవగానే రెట్టింపు డబ్బులు వస్తాయంటూ చెప్పడంతో రూ.16,821 చెల్లించి ఈబిజ్‌ కంపెనీ ఈ–లెర్నింగ్‌ కోర్సులో చేరా. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నాకు హాస్టల్‌ ఖర్చుల కోసం ఆ కంపెనీ ఇచ్చే డబ్బు ఉపయోగపడుతుందని ఆశించా. అయితే 2 నెలలు గడిచినా డబ్బులు రాలేదు. అంతేకాదు మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్‌ వస్తుందని చెప్పారు. దీంతో 8 మందిని చేర్పించా. ఎలాంటి కమిషన్‌ ఇవ్వలేదు. ఆ కంపెనీ ఇచ్చిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెరిచి చూస్తే నా బ్యాంక్‌ ఖాతాలో కమిషన్‌ వేసినట్లు కనిపిస్తున్నా... అకౌంట్లో మాత్రం డబ్బు పడలేదు. దీంతో ఆ కంపెనీ రిప్రజెంటీవ్‌లను వెళ్లి నిలదీస్తే డబ్బులు రావు నీ దిక్కున్నచోట చెప్పుకో అన్నారు. దీంతో సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించా. 
    – వివేక్, జగిత్యాల జిల్లా 

కమిషన్‌ వస్తుందని ఎరవేస్తారు..
పవన్‌ మల్హన్‌ ఎండీగా, అతని భార్య అనితా మల్హన్‌ డైరెక్టర్‌గా 2001లో నోయిడాలో ఈబిజ్‌.కామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 2007 నుంచి కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఈ–లెర్నింగ్‌ కోర్సుల పేరుతో కంపెనీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళుతున్నారు. పవన్‌ కుమారుడు హితిక్‌ కంపెనీ కార్యకలాపాలను చూస్తూ దాదాపు 7 లక్షల మందిని సభ్యులుగా చేర్పించాడు. ఈ–లెర్నింగ్‌ ప్రాజెక్టుల ద్వారా సులభ పద్ధతిలో డబ్బు సంపాదించే వ్యాపార మార్గాలున్నాయంటూ యువతను ఆకర్శిస్తారు. రూ.16,821 డబ్బులు వసూలు చేసి.. ఈబిజ్‌ బిజినెస్‌ ప్యాకేజీలు నచ్చకపోతే నెల రోజుల్లోపు నగదు తిరిగి ఇస్తామంటూ హామీలిస్తారు. ఈ నెల రోజుల సమయం తెలియకుండా విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇస్తూ వాళ్ల మనసు మారకుండా చూసుకుంటారు. ఈ సమయంలోనే మీరు మరో ఇద్దరిని ఈ కోర్సుల్లో చేర్పిస్తే 30 వేల పాయింట్లు, రూ.2,700 (తొమ్మిది శాతం) కమిషన్‌ వస్తుందని ఆశచూపుతారు. ఎక్కువ సంఖ్యలో చేర్పించిన వారికి సిల్వర్, గోల్డ్, డైమండ్, డిప్లోమేట్, సిల్వర్‌ డిప్లోమేట్, గోల్డ్‌ డిప్లోమేట్‌ లాంటి టైటిళ్లను ఇస్తారు. ఇలా ఈ–లెర్నింగ్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఏ యూనివర్సిటీకి అనుబంధంగా లేని సర్టిఫికెట్లను ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మొత్తంగా ఎక్కువ మంది విద్యార్థులు ఈ–లెర్నింగ్‌ కోర్సుల కన్నా సభ్యులను చేర్పిస్తే కమిషన్‌ వస్తుందనే ఆశతో పనిచేసేలా నిర్వాహకులు చూస్తారు. కంపెనీకి డీడీ ద్వారా డబ్బులు కట్టి చేరిన సభ్యుడికి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా కేటాయిస్తున్నారని సీపీ తెలిపారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top