యువతి కిడ్నాప్‌..ఆసక్తికర విషయాలు

Details Revealed Young Woman's Alleged kidnap Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : ఎట్టకేలకు యువతి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. వివరాలు..బుధవారం అర్ధరాత్రి 20 మంది వ్యక్తులు ఓ ల్యాబ్‌పై దాడికి వెళ్లడంతో సహజీవనం చేస్తున్న  యువకుడు, యువతి భయంతో గది తలుపులు వేసుకుని, తర్వాత ఏసీ విండోలో నుంచి పారిపోయిన ఘటన నాజ్‌ సెంటర్‌లో స్థాని కంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న ఈస్ట్‌ డీఎస్పీ నజీముద్దీన్, కొత్తపేట ఎస్‌హెచ్‌వో మధుసూదనరావు ఘటనా స్థలానికి వెళ్లి విచారించగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఎస్‌హెచ్‌వో మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నూ రు మండలం మన్నవ గ్రామానికి చెందిన వెంకట శివప్రసాద్‌ , గుంటూరు మల్లికార్జునపేటకు చెందిన ఎం.మౌనిక రెండు సంవత్సరాల కిందట ప్రేమించుకున్నారు. వేరువేరు కులాలైనా పెద్దల అంగీకారంతో నిశ్చయ తాంబూలాలు జరిగాయి. అయితే, రెండు కుటుంబాల మధ్యా అభిప్రాయ భేదాలు రావడంతో వివాహం రద్దయింది. శివప్రసాద్, మౌనికలు ఒక అభిప్రాయానికి వచ్చి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ వెంకటాద్రిపేటలోని ఓ ఇంట్లో ఉంటూ సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇద్దరి మధ్యా తిరిగి మనస్పర్థలు తలెత్తాయి. దీంతో మౌనిక విడిపోయి తల్లి దగ్గరకు వెళ్లింది. అక్కడి నుంచి రోజు ఉద్యోగానికి వచ్చేది. ఈ క్రమంలో ఇద్దరు మరలా దగ్గరయ్యారు.

నాజ్‌ సెంటర్లోని ఒకే ల్యాబ్‌లో టెక్నీషియన్లుగా ఉద్యోగంలో చేరారు. బుధవారం రాత్రి  శివప్రసాద్‌ ఓ విషయంలో గొడవపడి మౌనికను బెదిరించడం ప్రారంభించాడు. వారి సహ ఉద్యోగి ఒకరు మౌనిక అన్న సంతోష్‌కుమార్‌కు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. అతను 20 మంది అనుచరులతో ల్యాబ్‌ వద్దకు వచ్చాడు. అంతమంది జనాన్ని చూసిన ఇద్దరు భయపడి వారుండే తలుపు లోపల గడియ పెట్టుకున్నారు. ఏసీ విండో తొలగించి అందులో నుంచి  బయటకు పారిపోయారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపడంతో సమాచారం అందుకున్న ఈస్డ్‌ డీఎస్పీ నజీముద్దీన్‌ , ఎస్‌హెఓ మధుసూదనరావు ఘటన స్థలానికి వచ్చి విచారించారు. మౌనిక అన్న సంతోష్‌కుమార్‌ తన చెల్లెలు కిడ్నాప్‌కు గురయినట్లు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు కోసం తీవ్రంగా గాలించారు. అయితే, గురువారం సాయంత్రానికి శివప్రసాద్, మౌనికలు కొత్తపేట పోలీస్టేషన్‌కు వచ్చి ఎస్‌హెచ్‌వో ముందు హాజరయ్యారు. మౌనిక తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తన అన్నతో పాటు పెద్దసంఖ్యలో వ్యక్తులు రావడంతో వారు తమపై అఘాయిత్యం చేస్తారని భయపడి పారిపోయినట్లు వివరించింది. తాము సహజీవనం కొనసాగిస్తామని ఇద్దరు హామీ ఇవ్వడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైనట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top