ఆర్థిక సైబర్‌ నేరగాళ్లలో అత్యధికులు అక్కడి వారే

Cyber Criminals From West Bengal And Delhi in Hyderabad - Sakshi

గత ఏడాది 68 మందిని అరెస్టు చేసిన సైబర్‌ కాప్స్‌

58 మందితో తర్వాత స్థానంలో ఢిల్లీకి చెందినవారు

స్థానికుల్లో అత్యధికం 'సోషల్‌ మీడియా’ నిందితులే

స్పష్టం చేస్తున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల డేటా

సాక్షి, సిటీబ్యూరో: సైబర్‌ నేరగాళ్లకు నగరం అడ్డాగా మారుతోంది. వీరిలో అత్యధిక శాతం పశ్చిమ బెంగాల్‌కు చెందినవారే కావడం గమనార్హం.ఆర్థికాంశాలతో ముడిపడిన నేరాలు చేస్తూ గత ఏడాది సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కినఅంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికిచెందిన వారే ఎక్కువగా ఉన్నారు. 2019లో సైబర్‌ కాప్స్‌ 23 రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేశారు. 15 రాష్ట్రాలకు చెందిన 237 మందిని అరెస్టు చేశారు. వీరిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే 28.69 శాతం ఉన్నారు. గత ఏడాది నగర నేరపరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో మొత్తం 1,396 కేసులునమోదయ్యాయి.  

సైబర్‌ నేరాలు ప్రధానంగా రెండు రకాలు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి. ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్‌ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాసులు) దాదాపు 99 శాతం సోషల్‌ మీడియా కేసుల కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్‌ఫోన్లను వినియోగించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులే. కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సైతం ఈ తరహా కేసుల్లో అరెస్టయ్యారు. 

అడ్డంగా దోచేసి..
సైబర్‌ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. 2019 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో పశ్చిమ బెంగాల్‌ వాసులే ఎక్కువగా ఉన్నారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదవుతున్న కేసుల్లో బ్యాంకు అధికారుల మారిదిగా ఫోన్లు చేసి ఖాతా వివరాలు, ఓటీపీ సంగ్రహించి అందినకాడికి కాజేసే వాటితో పాటు ఓఎల్‌ఎక్స్‌లో బోగస్‌ ప్రకటనలు ఇచ్చి అడ్వాన్సుల పేరుతో దండుకుని మోసం చేస్తున్నవే ఎక్కువ. ఓటీపీ ఫ్రాడ్స్‌ చేయడంతో ఝార్ఖండ్‌లోని జమ్‌తార ముఠాలది అందెవేసిన చేయి. వీళ్లు తమ సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ ప్రాంతానికి చెందిన వారి బ్యాంకు ఖాతాలు వినియోగిస్తూ వాటిలో బాధితుల డబ్బు బదిలీ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు చిక్కుతున్న వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. 

తర్వాత స్థానంలో ఢిల్లీవాళ్లు..
సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్న ఇతర రాష్ట్రాల వారిలో వెస్ట్‌ బెంగాల్‌ తర్వాత స్థానం ఢిల్లీకి చెందిన వారిదే. ఉద్యోగాలు, వీసాలు, ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు తదితర పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీతో పాటు నోయిడా, గుర్గావ్‌లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని, సెల్‌ఫోన్‌ నంబర్ల డేటాబేస్‌ ఆధారంగా దేశ వ్యాప్తంగా మోసాలకుపాల్పడుతున్నారు. వర్క్‌స్టేషన్లుగా పిలిచే రెడీ యూజ్‌ కాల్‌ సెంటర్లను కొన్ని నెలల పాటు వినియోగించే ఈ నేరగాళ్లు ఆపై వాటిని ఖాళీ చేసేస్తుంటారు.ఈ తరహా నేరాలు పాల్పడే నేరగాళ్లు ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని ముంబై, కర్ణాటకలోని బెంగళూరులతో పాటు గుజరాత్‌కు చెందిన వారూ కొది
సంఖ్యలో ఉంటున్నారు.  

నైజీరియన్‌ కేసుల్లో ‘ఈశాన్య’ ఖాతాలు..
ఈ తరహాకు చెందిన సైబర్‌ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోమాలియా వంటి ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్‌కు వచ్చి ఢిల్లీ సహా ఆయా నగరాల్లో నివసిస్తున్న నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి ఈశాన్య రాష్ట్రాలకు నుంచి ఆ నగరంలో ఉంటున్న వారిని మనీమ్యూల్స్‌గా మారి సహకరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల బాధితుల నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి అవసరమైన బ్యాంక్‌ ఖాతాలను అందిస్తూ, ప్రతిఫలంగా కమీషన్లు తీసుకునే వారిని సాంకేతికంగా మనీమ్యూల్స్‌ అంటారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్‌గా ఉన్న వారి కోసం సిటీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు అసోం, నాగాలాండ్, మేఘాలయా, మిజోరాం, మణిపూర్‌లకు వెళ్లి వచ్చినా.. నేరగాళ్లు బ్యాంకు ఖాతాలకు వినియోగించిన చిరునామాలు నకిలీకి కావడంతో ఎవరూ చిక్కలేదు. ఈ కేసుల్లో సూత్రధారులైన నైజీరియన్లలో అత్యధికులు పరారీలో ఉన్నారు.

బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యంగా..
హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులుబాధితులకు సత్వర న్యాయం జరగడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేస్తున్నా.. మరికొందరికి సీఆర్పీసీ 41 (ఏ) సెక్షన్‌ ప్రకారం నోటీసులు జారీ చేస్తూ సాంకేతికంగా అరెస్టు చేస్తున్నారు. బాధితుల నుంచి కాజేసిన డబ్బు తక్షణం తిరిగి ఇవ్వడానికి అంగీకరించి, అలా చేసిన నిందితులను జైలుకు పంపకుండాకేవలం 41 (ఏ) నోటీసులు జారీ చేస్తున్నారు. కేసు మాత్రం యథాతథంగా ఉంచి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇక సోషల్‌మీడియా సంబంధితనేరాల్లో అశ్లీలత లేని, మహిళలకుసంబంధించిన నేరం కాని సందర్భంలో మాత్రమే నోటీసులు ఇస్తున్నారు. మహిళలు, యువతులు బాధితులుగా ఉన్న కేసుల్లో నేరగాళ్లు కచ్చితంగా ఊచలు లెక్కపెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

అప్రమత్తతతోనే నిరోధం సాధ్యం
సైబర్‌ నేరాల్లో బాధితులుగా మారితే నేరగాళ్లను పట్టుకున్నా రికవరీలు మాత్రం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి వాటి బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. గిఫ్ట్‌లు, లాటరీలు పేరు చెబితే ఆ ఫోన్లకు దూరంగా ఉండాలి. ఏ ఉద్యోగమైనా దొడ్డిదారిలో రాదని గుర్తించుకోవాలి. విదేశీ వీసాల కోసం అధీకృత ఏజెంట్లను, నేరుగా సంప్రదించాలి. బ్యాంకు ఓటీపీల కోసం ఫోన్లు చేయవని గుర్తుంచుకోవాలి.క్యూఆర్‌ కోడ్స్, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  – కేవీఎం ప్రసాద్,సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top