పెళ్లి కోసం పొదుపు చేసుకుంటే!

Cyber Criminals Cheat Women Constable in Hyderabad - Sakshi

మహిళా కానిస్టేబుల్‌కు  టోకరా

ఆమె గూగుల్‌ పేకు తన బ్యాంకు ఖాతా

రూ.90 వేలు పొగొట్టుకున్న బాధితురాలు

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌ సైబర్‌ నేరగాళ్ళకు టార్గెట్‌గా మారారు. ఆమె తన వివాహం కోసం దాచుకున్న డబ్బును కాజేశాడు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బుధవారం నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. యూసుఫ్‌గూడ ప్రాంతంలో నివసించే ఓ యువతి పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఈమెకు ఆంధ్రా బ్యాంక్‌తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోనూ ఖాతాలు ఉన్నాయి. తన గూగుల్‌ పే ఖాతాను ఆంధ్రా బ్యాంక్‌లో ఉన్న అకౌంట్‌తో లింకు చేసుకున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అకౌంట్‌ను తన గూగుల్‌ పేలో బెనిఫిషియరీగా జత చేసుకున్నారు. అవసరమైన సందర్భాల్లో తన గూగుల్‌ పే ద్వారా ఆంధ్రా బ్యాంక్‌లో ఉన్న నగదును బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలోకి మార్చుకునే వారు. ఇలానే గత నెలలో రూ.10 వేలు, మంగళవారం రెండు దఫాల్లో రూ.80 వేలు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలోకి బదిలీ చేశారు.

ఆమె తన వివాహం కోసం పొదుపు చేసుకుంటూ వచ్చారు. శుక్రవారం వివాహ ముహూర్తం కావడంతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలోకి బదిలీ చేసిన రూ.90 వేలు డ్రా చేసుకోవాలని భావించారు. దీంతో బుధవారం ఆ బ్యాంకును సంప్రదించగా అందులో నగదు లేనట్లు తెలిసింది. తన గూగుల్‌ పేలో బెనిఫిషియరీగా యాడ్‌ చేసుకున్న ఖాతాకు పంపిన నగదు మాయం కావడంతో ఆమె మోసపోయానని భావించారు. గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ బి.మధుసూదన్‌ దర్యాప్తు చేపట్టారు. ఇందులులో భాగంగా సదరు మహిళ కానిస్టేబుల్‌ గూగుల్‌ పేలో బెనిఫిషియరీగా యాడ్‌ అయిన ఖాతా వివరాలు లోతుగా పరిశీలించగా... అది ఎస్‌బీఐకి చెందినదిగా తేలింది. గుర్తుతెలియని దుండగులు ఆమె పేరుతోనే డిస్‌ప్లే నేమ్‌ సృష్టించి, దీన్ని బెనిఫిషియరీగా ఆమె గూగుల్‌ ఖాతాలో యాడ్‌ చేశారు. అప్పటికే యాడ్‌ అయి ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాను డిలీట్‌ చేశారు. డిస్‌ప్లే నేమ్‌గా ఆమె పేరే, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాకు పెట్టుకున్నట్లే కనిపిస్తుండటంతో బాధితురాలికి అనుమానించలేదు. దీంతో రూ.90 వేలు బదిలీ చేసి మోసపోయారు. ప్రాథమికంగా సేకరించిన అనుమానిత ఖాతా స్టేట్‌మెంట్‌లో డబ్బు పోయిన ఖాతా డమ్మీ అకౌంట్‌ అంటూ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇది ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్ళ పనా? లేక బాధితురాలికి పరిచయస్తులే చేసిన నేరమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

లాటరీ పేరుతో పాతబస్తీ మహిళకు...
నగరంలోని పాతబస్తీ మహిళకు ఫోన్‌ ద్వారా ఎర వేసిన సైబర్‌ నేరగాళ్ళు లాటరీ తగిలిందంటూ టోకరా వేశారు. రూ.కోటి వచ్చిందంటూ చెప్పి రూ.5 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళకు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. రూ.కోటి లాటరీ తగిలిందని చెప్పిన దుండగులు ఆ మొత్తం సొంతం చేసుకోవడానికి కొన్ని ట్యాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆపై వివిధ పేర్లు చెప్పి దఫదఫాలుగా రూ.5 లక్షలు తమ బ్యాంకు ఖాతాల్లో వేయించుకున్నారు. అంతటితో ఆగకుండా మరికొంత డబ్బు చెల్లించాలంటూ వాళ్ళు ఒత్తిడి చేస్తుండటంతో  అనుమానించిన బాధితురాలు గురువారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top