కాపురాల్లో ‘కరక్కాయ’

Conflicts In Families With Karakkaya Scam In Hyderabad - Sakshi

డబ్బులు పోయె..పరువూ పోయె

‘కరక్కాయల పొడి’ ఉదంతంతో కుటుంబాల్లో కలహాలు

ఎంఎల్‌ఎం స్కీమ్‌ల్లో చేరొద్దు...చేర్పించొద్దు

ప్రజలు మారాలంటున్న పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో:  ‘ఒక్క ఫోన్‌ కాల్‌ మీ జీవితాన్ని మార్చేస్తుందంటూ ప్రకటనను చూసి ఆకర్షితురాలైన కేపీహెచ్‌బీకి చెందిన అరుణ జీవితం నిజంగానే మారిపోయింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చుననే ఆశపడిన ఆమెకు ‘కరక్కాయల పొడి’ రూపంలో డబ్బు పోవడమే కాకుండా ఆమె కుటుంబంలో కలతలు రేపింది. రూ. వెయ్యితో కిలో కరక్కాయలు కొనుగోలు చేసి పొడి చేసి ఇస్తే రూ.1300 వస్తున్నట్లు తెలియడంతో ఈ విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో దాదాపు 12 మంది అరుణ మాటలు విని కరక్కాయల పొడిలో పెట్టుబడి పెట్టారు. చివరకు సదరు కంపెనీ బిచాణా ఎత్తివేయడంతో డబ్బులు పోయిన బెంగలో ఉన్న ఆమెను బంధువుల మాటలు మరింత నొప్పించాయి. నీ కారణంగానే  పెట్టుబడులు పెట్టామంటూ వారు గొడవకు దిగడంతో అరుణ, ఆమె భర్త మధ్య ఘర్షణకు దారి తీసింది. 

అరుణ ఒక్కరే కాదు..కరక్కాయల పొడి కేసులో మోసపోయిన దాదాపు 500 మంది మహిళల్లో 150 మంది మహిళల పరిస్థితి ఇదే. అయినవాళ్లే కదా వారూ లాభపడతారన్న ఉద్దేశంతో వీరు చెప్పిన మాటలు ఇప్పుడూ ఏకంగా వారిని బాధిస్తున్నాయి. ఓ వైపు డబ్బులు పోగా..మరోవైపు బంధువుల మాటలతో ఆవేదనకు లోనైన పలువురు మహిళలు సైబరాబాద్‌ పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.  కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌ ఇంటిగ్రేట్‌ మల్టీటూల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐఎంటీ) పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించి పలు కంపెనీలు ఆయుర్వేద మందుల్లో కరక్కాయల పొడిని వినియోగిస్తారని ప్రచారం చేశారు.

బేగంపేటలో కిలోకు కేవలం రూ.38కి కొనుగోలు చేసిన కరక్కాయలను ఏకంగా రూ.వెయ్యికి అమ్మి పౌడర్‌గా చేసి తిరిగిస్తే రూ.1300 ఇస్తామంటూ  650 మందిని మోసగించిన నెల్లూరు జిల్లా అంబపురంకు చెందిన ముప్పల మల్లికార్జున ముఠాను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంతో తమ డబ్బులు వస్తాయన్న ఆశతో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ ఘటన నుంచైనా ప్రజలు మారాలని పోలీసులు కోరుతున్నారు. విద్యావంతులు సైతం ఈ మోసంలో చిక్కుకోవడం దారుణమని డబ్బుపై ఉన్న ఆశను వెల్లడిస్తోందని, దీనినే నేరగాళ్లు ఆసరాగా చేసుకొని టోపీ పెడుతున్నారని వారు పేర్కొంటున్నారు.

సులువుగా డబ్బులు రావు...
డబ్బులు సులభంగా సంపాదించేందుకు షార్ట్‌కట్‌ మార్గాలు ఉండవు. ఎవరైనా ఇలాంటి ప్రకటనలు ఇస్తే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ వ్యాపారంలో చాలా మంది మహిళలే బాధితులుగా ఉంటున్నారు. బంధువులను కూడా ఆయా స్కీమ్‌ల్లో చేర్పిస్తున్నందున కుంటుంబాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఎంఎల్‌ఎం కంపెనీలు, పొంజి స్కీమ్‌లు, చిట్స్, డిపాజిట్‌ కంపెనీలు నమ్మశక్యం కాని ఆఫర్లు ఇస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా వాటిని ఆదిలోనే అరికట్టవచ్చు.     – వీసీ సజ్జనార్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top