అన్న స్నేహితులే రేప్ చేయబోతే..! | Sakshi
Sakshi News home page

అన్న స్నేహితులే రేప్ చేయబోతే..!

Published Thu, Feb 8 2018 1:09 PM

class students try to rape attempt on class mate - Sakshi

ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిని తన అన్న స్నేహితులే అత్యాచారం చేసేందుకు పక్కా ప్రణాళిక వేయడం...విద్యార్థిని చాకచక్యంగా తప్పించుకొని పాఠశాల ఉపాధ్యాయులకు జరిగిన విషయం తెలియజేయడం...తరువాత తల్లిదండ్రులతో పోలీసులను ఆశ్రయించిన ఘటన ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...

విజయనగరం, గరివిడి:  పట్టణంలో రామేశ్వర కాలనీకి చెందిన ఓ విద్యార్థినిపై ఓ ముగ్గురు యువకులు అత్యాచార యత్నానికి కుట్ర పన్నగా ముందుగానే గుర్తించిన ఆ విద్యార్థిని తెలివిగా వారి నుంచి తప్పించుకుంది. సమయస్ఫూర్తితో పాఠశాలకు చేరుకుని జరిగిన విషయాన్ని తమ ఉపాధ్యాయులకు తెలియజేసింది. ఉపాధ్యాయులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా తమ కుమార్తెపై జరిగిన ఘటనకు సంబంధించి గరివిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణను చేపట్టారు. అనంతరం ఈ నెల 6న అత్యాచారానికి వ్యూహం పన్నిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా బాధితురాలైన విద్యార్థిని నుంచి బుధవారం వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం వివరాలను విలేకరులకు వెల్లడించారు. కొండపాలేంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ నెల 2న ఉదయం 11.15గంటలకు విరామ సమయంలో సహ విద్యార్థిని నడవలేని పరిస్థితిలో ఉండగా వాళ్ల ఇంటికి తీసుకువెళ్లింది.

తనని వాళ్ల ఇంటికి అప్పగించి తిరిగి పాఠశాలకు వస్తుండగా తన అన్నయ్యకు పరిచయం ఉన్న కోడూరు గ్రామస్తుడైన ధన వచ్చి ఎక్కడికి వెళ్తున్నావంటూ..అడిగాడు. పాఠశాలకు వెళ్తున్నానని విద్యార్థిని చెప్పగా తన బైక్‌పై దింపుతా..రమ్మని ధన చెప్పడంతో బైక్‌ ఎక్కింది. ధన కోడూరు వైపు దగ్గరలో ఉన్న మామిడితోట వైపు తీసుకువెళ్లగా అక్కడ అప్పటికే ఇద్దరు యువకులు ఉన్నారు. దాన్ని గుర్తించిన విద్యార్థిని పాఠశాల దాటి ముందుకు వెళ్లిపోతున్నాం ధన అన్నయ్య అంటూ చెప్పింది. దీంతో ధన ముందుగా స్నేహితుల వద్దకు వెళ్లి తరువాత పాఠశాల వద్ద దింపుతానని ధన చెప్పాడు. మామిడి తోట దగ్గరకు వెళ్లే సరికి చున్నీ టైరులో పడిపోయిందని చెప్పి బైక్‌ ఆపమని విద్యార్థిని కోరడంతో ఆపాడు.

వెంటనే అక్కడ నుంచి చాకచక్యంగా తప్పించుకుని పాఠశాలకు నడుచుకుంటూ విద్యార్థిని వచ్చేసింది. విద్యార్థిని ఆలస్యంగా పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు ప్రశ్నించారు. దీంతో విద్యార్థిని జరిగిన ఉదంతాన్ని పీఈటీ, గణిత ఉపాధ్యాయురాలికి చెప్పింది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. తరువాత ఈ నెల 5న విద్యార్థిని తండ్రి స్నేహితుడైన చంద్రరావుకు విషయం వివరించారు. చంద్రరావు, ఈశ్వరరావు అంకుల్, తన తండ్రితో కలిసి గరివిడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న గరివిడి పోలీసులు విద్యార్థిని ప్రశ్నించగా మామిడి తోట వద్ద ఉంటున్న ఇద్దరిలో తన ఇంటి వెనుకన ఉంటున్న సాయిబుల అబ్బాయి పేరు తెలుసని, మరో అబ్బాయి పేరు తెలియదని, చూస్తే గుర్తు పడతానని విద్యార్థిని చెప్పింది. ఇదిలా ఉండగా ఈ కేసును నీరుగార్చేందుకు స్థానిక నేతలు తలదూర్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement