ముగ్గురు పసికందులు మృతి | Child Deaths in Anantapur | Sakshi
Sakshi News home page

ముగ్గురు పసికందులు మృతి

Oct 25 2018 11:58 AM | Updated on Oct 25 2018 11:58 AM

Child Deaths in Anantapur - Sakshi

చనిపోయిన కవిత బిడ్డను ఆటోలో ఇంటికి తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

హిందూపురం అర్బన్‌: హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ముగ్గురు పసికందులు మృతి చెందటం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. ఈ నెల 18న మడకశిర మండల పాపసానిపల్లికి చెందిన కవిత తన నాలుగు నెలల ఆడ శిశువుకు ఆరోగ్యం బాగలేకపోవడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యసేవలు పొందుతున్న పసిబిడ్డ బుధవారం ఉదయం చనిపోయింది. ప్రాణం పోస్తారని బిడ్డను తీసుకువస్తే బిడ్డ శవాన్ని చేతికిచ్చారని కవిత కన్నీరుమున్నీరైంది. 

ఇలా ఉండగానే గంట తర్వాత  చౌళూరు గ్రామానికి చెందిన సుకన్య మూడునెలల ఆడశిశువుకు దగ్గు ఉందని, సరిగా పాలు తాగలేకపోతోందని ఆస్పత్రిలో చేర్చింది. చికిత్స పొందుతూ పాప 10 గంటల సమయంలో మృతి చెందింది. అక్కడి సిబ్బంది విషయం తెలిస్తే రచ్చ అవుతుందని భావించి పాప బతకదని ముందే చెప్పామని చెప్పి బాధితులను ఆటో ఎక్కించి పంపించేశారు.  

మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిసలమానేపల్లికి చెందిన శ్రావణి రెండు నెలల మగశిశువు ఆరోగ్యం బాగలేదని ఆస్పత్రికి తీసుకువచ్చింది. వైద్యుల సూచన మేరకురక్త పరీక్షలు చేయించి తీసుకొచ్చిన కొద్దిసేపటికే బిడ్డ శీరీరం చల్లబడిపోయింది. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు చెప్పారు. దీంతో తల్లి శ్రావణి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో లేపాక్షి పీహెచ్‌సీ ఆస్పత్రిలో చేర్పించారు.  

పేరుకే జిల్లా ప్రభుత్వాస్పత్రి  
హిందూపురంలో రూ.23 కోట్లు వెచ్చించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి ఏ మాత్రం తీసిపోని రీతిలో హంగు అర్భాటంతో ప్రభుత్వ ఆస్పత్రి భవనాలు, సదుపాయాలు కల్పించారు. అయితే ఇక్కడ వైద్యం అందించడానికి వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. పేరుకే జిల్లా ఆస్పత్రి. సేవల్లో పీహెచ్‌సీ కన్నా అధ్వానంగా మారిందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైద్యసేవలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఏమాత్రం పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెబితే ‘ఇక్కడ పదిమంది లేరు.. వచ్చి చూస్తారు.. కాస్త ఓపిక ఉండాలి’ అంటూ చీదరించుకుంటున్నారని తెలిపారు. వైద్యులు వచ్చి చూసేసరికి ఉన్న ప్రాణం పోయే పరిస్థితి నెలకొంటోందన్నారు.

విచారణకు కలెక్టర్‌ ఆదేశం
అనంతపురం న్యూసిటీ: హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న పసికందుల మరణాలపై కలెక్టర్‌ వీరపాండియన్‌ విచారణకు ఆదేశించారు. జేసీ–2 సుబ్బరాజు, డీఎంఅండ్‌హెచ్‌ఓ అనీల్‌కుమార్, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రమేష్‌నాథ్‌తో కమిటీగా వేశారు. కమిటీ రెండు రోజుల్లోపు లోతుగా ఆరా తీసి నివేదిక ఇవ్వాలని సూచించారు. చిన్నారుల మృతి పట్ల కల్టెకర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   

అన్నీ సహజ మరణాలే
ఒకేరోజు ముగ్గురు పసికందులు చనిపోయారు. అన్నీ సహజ మరణాలే. పాపసానిపల్లి కవితకు మేనమామతో పెళ్లయ్యింది. మేనరికం వల్ల బిడ్డ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయింది. చౌళూరు సుకన్య బిడ్డ కుపోషణకు గురై చనిపోయింది. బిసలమానేపల్లి శ్రావణి బిడ్డకు రక్తం తక్కువగా ఉండటంతో మృతి చెందింది.– డాక్టర్‌ కేశవులు, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి  

వైద్యసేవల్లో నిర్లక్ష్యం లేదు
హిందూపురం ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకున్న మరణాలపై వైద్యశాఖ నిర్లక్ష్యం లేదు. కేసులన్నీ చివరిలో ఆస్పత్రికి వచ్చాయి. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యమే అందించారు.
–రమేశ్‌నాథ్, డీసీహెచ్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement