ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యం

Chain Snatcher Arrest in Guntur - Sakshi

వ్యసనాలకు బానిసగా మారి చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న యువకుడు

25 కేసుల్లో రూ.31లక్షల విలువ చేసే కిలోకి పైగా బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ విజయారావు

గుంటూరు: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళల్ని లక్ష్యంగా చేసుకొని చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి పోలీసులకు సవాలుగా మారిన ఘరానా దొంగను అర్బన్‌ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ సీహెచ్‌. విజయారావు వివరాలు వెల్లడించారు. చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన యువకుడు పోతినేని గోపి ఆరో తరగతి వరకు చదివాడు. తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారి పేకాట, మద్యం, కోడి పందాలకు అలవాటు పడ్డాడు. అప్పులపాలై వాటిని తీర్చేందుకు చైన్‌ స్నాచింగ్‌లు చేయాలని నిశ్చయించుకొని ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. నంబరు ప్లేటును తొలగించి ముఖానికి ఖర్చీఫ్‌ కట్టుకొని హెల్మెట్‌ ధరించి..శుభకార్యాలకు, దేవాలయాలకు  రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి ద్విచక్ర వాహనంపై పరారవుతుంటాడు. ఈ తరహాలో తెనాలి, పొన్నూరు, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో గడచిన ఏడాది ఏప్రిల్‌ నుంచి వరుసగా ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు 25 చైన్‌ శ్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.

పట్టుపడిందిలా...
అర్బన్‌ జిల్లా పరిధిలో మొత్తం 22 చైన్‌ స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో స్థానిక పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమేరా పుటేజీల్ని పరిశీలించినా నిందితుడి ఆచూకీని గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో అర్బన్‌ జిల్లా పరిధిలో మరింత నిఘాను పెంచారు. ఈనెల 12న తెనాలి వైపు నుంచి మంగళగిరి ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఆనవాళ్లను ప్రత్యేక టీంలో ఉన్న కానిస్టేబుళ్లు ఏ.నాగాంజనేయులు, కిరణ్‌కుమార్‌ గుర్తించారు. వెంటనే మంగళగిరి, సీసీఎస్‌ సీఐలను అప్రమత్తం చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు మంగళగిరి వైపు వస్తున్న యువకుడిని పెద్దవడ్లపూడి గ్రామ సమీపంలోని కోకోకోలా కంపెనీ ఎదురుగా చూసి అదుపులోకి తీసుకొనేందుకు యత్నించారు. అప్పటికే పోలీసుల్ని గుర్తించిన యువకుడు పరారయ్యేందుకు విఫలయత్నం చేసి దొరికి పోయాడు. వారిదైన శైలిలో విచారించగా నేరాలకు పాల్పడినట్లు అంగీకరించడంతో రూ. 31 లక్షల విలువ చేసే 1.37కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

సిబ్బంది పనితీరు అభినందనీయం
విధి నిర్వహణలో ప్రతిభను చూపి పోలీసులకు సవాలుగా మారిన నేరస్తుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న కానిస్టేబుళ్లు నాగాంజనేయులు, కిరణ్‌కుమార్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి క్యాష్‌ రివార్డులు అందచేశారు. సీఐలు రవిబాబు, అబ్దుల్‌ కరీం, సురేష్‌బాబు, సిబ్బందిని అభినందించి వారికి కూడా క్యాష్‌ రివార్డులు అందచేస్తామని ఎస్పీ వివరించారు. ధైర్యసాహసాలను ప్రదర్శించి నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు వైటీ నాయుడు, బి.లక్ష్మీనారాయణ, ఎస్‌.రాఘవ పాల్గొన్నారు.

మూడు రోజుల్లో నిందితుల అరెస్టు
మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణం సమీపంలో ఈనెల 11న రాత్రి సమయంలో చోటు చేసుకున్న ఘటనలో అంగడి జ్యోతి మృతి చెందడం విచారకరమని ఎస్పీ తెలిపారు. నిర్జీవ ప్రదేశం, వీధిలైట్లు లేని కారణంగా మరింత నిఘాను పెట్టలేక పోయామని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏకు లేఖ రాస్తున్నామని చెప్పారు. యువతిపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేవన్నారు. సాంకేతిక పరంగా విచారణ కొనసాగుతుందన్నారు. తెలిసిన వ్యక్తులే దుర్ఘటనకు కారణమై ఉంచవచ్చని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. మరో మూడు రోజుల్లో నిందితుల్ని అరెస్టు చేసి మీడియా ఎదుట ఉంచుతామని వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top