బస్సు ఎక్కుతున్నారా.. సెల్‌ఫోన్‌ జాగ్రత్త..!

Cell Phone Robbey Gang In YSR Kadapa - Sakshi

ఖాజీపేట బస్టాండులో చెలరేగుతున్న దొంగలు

బాధితులు ఫిర్యాదు చేసినా నమోదు కాని కేసులు

ఒకరిపై కేసు పెట్టి చేతులు దులుపుకొన్న పోలీసులు

సెల్‌ఫోన్‌ దొంగల వెనుక పెద్ద ముఠానే ఉందా?

వైస్సార్ , ఖాజీపేట : ‘మీరు బస్సు ఎక్కుతున్నారా.. అయితే మీ సెల్‌ఫోన్‌ జాగ్రత్తగా ఉంచుకోండి’... ఎందుకంటే బస్సుల్లో సెల్‌ఫోన్‌ దొంగలు ఉన్నారు. కొంత కాలంగా ఖాజీపేట బస్టాండ్‌లో సెల్‌ఫోన్‌ దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న వారిని టార్గెట్‌ చేసి దోచుకెళ్తున్నారు. అలా చోరీ అయిన ఫోన్‌లు బయటకు పంపి అమ్ముకుంటున్నారు. దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడం లేదు. ఇచ్చిన అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. రెండు నెలలుగా ఖాజీపేట బస్టాండ్‌లో సెల్‌ఫోన్‌ దొంగల ముఠా ఒకటి సంచరిస్తోంది. ఇందులో ఐదుగురు నుంచి ఆరుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరంతా ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు గమనించి వారి జేబులోని విలువైన సెల్‌ఫోన్‌లను చోరీ చేస్తున్నారు. ఇలా  మే, జూన్‌ నెలల్లోనే 50కి పైగా చోరీకి గురైనట్లు బాధితులు పేర్కొంటున్నారు. చోరీకి గురైన ప్రతి సెల్‌ఫోన్‌ రూ.10 వేల నుంచి రూ.30 వేల దాకా ఉంటుందని సమాచారం. ఇలా ఫోన్లు పోగొట్టుకున్న వారిలో 20 మందికి పైగానే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మిగిలిన వారు తమ ఖర్మ అనుకుని వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అధికారికంగా కేవలం 10 మంది ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కొందరు బాధితులు మాత్రం తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా బుట్టదాఖలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకరిపై కేసు నమోదు
ఖాజీపేట బస్టాండ్‌లో బస్సు ఎక్కేటప్పుడు ఖాజీపేట నుంచి తిరుపతికి వెళుతున్న ఒక కానిస్టేబుల్‌ తన స్మార్ట్‌ఫోన్‌ను.. చోరీ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని గుర్తించాడు. వెంటనే అతన్ని పట్టుకుని ఖాజీపేట పోలీసులకు అప్పగించాడు. దొరికిన వ్యక్తిని విచారణ చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. సదరు దొంగను అనంతపురం జిల్లా గుత్తికి తీసుకెళ్లి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అక్కడ కొందరు సెల్‌ఫోన్‌ అమ్మకందారుల నుంచి రూ.1.60 లక్షలు తీసుకుని వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలా తెచ్చిన మొత్తంలో రూ.26 వేలు మాత్రమే రికవరీ కింద కేసులో చూపించారు. సెల్‌ఫోన్‌ పోయినట్లు ఫిర్యాదు చేసిన 20 మందిలో 8 మందిని పోలీసులు ఎంపిక చేసుకున్నారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లు కోర్టుకు హాజరుపరిచి 8 మంది బాధితులకు డబ్బును ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన సొమ్ము స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లోతుగా విచారణ చేయని పోలీసులు
దొరికిన దొంగను పోలీసులు లోతుగా విచారణ చేయలేదని తెలుస్తోంది. అతను ఎవరు? దొంగలించిన సెల్‌ఫోన్లు ఎవరికి అమ్ముతున్నాడు? దొంగతనాలు చేసేది ఒకరా లేక ఎంత మంది ఉన్నారు? వారు ఎవరు? వారి వెనుక ఎవరు ఉన్నారు? ఇలాంటి వాటిలో ఏ ఒక్క అంశంపై కూడా పోలీసులు విచారణ జరపలేదని తెలుస్తోంది. విచారణకు వెళ్లినప్పుడు పోలీసులకు రూ 1.60 లక్షలు ఎవరు ఇచ్చారు.. ఎందుకు ఇచ్చారన్నది అంతు చిక్కని విషయంగా మారింది.

దొంగల వెనుక బడా ముఠా?
ఖాజీపేట బస్టాండులో దొరికిన దొంగ వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ దొంగల ద్వారా సెల్‌ఫోన్లు చోరీ చేయించడం అలా తెచ్చిన ఫోన్ల సిమ్‌ కార్డులు తీసేసి ఐఎంఈ నంబర్లు మార్చి ఇతరులకు తక్కువ ధరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా చోరీలు చేసే వారు 10 మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఫోన్ల అమ్మకందారులు దొంగలకు కొంత డబ్బు ఇచ్చి సెల్‌ఫోన్లు చోరీ చేయిస్తున్నట్లు సమాచారం.

కేసు నమోదు చేయలేదు
నేను బస్సు ఎక్కేటప్పుడు సెల్‌ఫోన్‌ చోరీ చేశారు. వెంటనే గుర్తించి పరిశీలించే సరికి దొంగలు పరారయ్యారు. ఇదే విషయం ఖాజీపేట పోలీసు స్టేషన్‌లో మే నెలలోనే ఫిర్యాదు చేశాను. ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదు. పైగా నా తర్వాత ఫిర్యాదు చేసిన వారికి రికవరీ చూపించారు. నా గురించి పట్టించుకోలేదు. – రవీంద్రారెడ్డి, పాల వ్యాపారి, ఖాజీపేట

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top