కారు పంక్చర్‌..చూస్తే రూ.కోటి విలువ గల..

Caught One Crore Value Cannabis In Guntur - Sakshi

కారు టైరు బరెస్టుకావడంతో పట్టుబడిన వైనం

కారులో 121 ప్యాకెట్లలో గంజాయి

విలువ రూ.కోటికి పైగా ఉంటుందని అంచనా! 

సాక్షి, యడ్లపాడు(గుంటూరు) :  కారులో తరలిస్తున్న 242 కిలోల గంజాయి నిల్వల్ని స్థానికుల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రమైన యడ్లపాడులో శుక్రవారం జరిగింది. తెల్లవారుజాము సుమారు 5.30 గంటల మధ్యలో కారు టైరు పగలడంతో గ్రామంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ బ్రిక్స్‌ తయారీ ప్రాంగణంలో దానిని గుర్తుతెలియని వ్యక్తులు నిలిపారు. ఆ కారును గమనించిన బ్రిక్స్‌ కంపెనీ కార్మికులు ఆ వాహనాన్ని అక్కడి నుంచి తీయాలని, తమ ట్రాక్టర్‌ వస్తుందని చెప్పారు.

అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ బ్యాగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అనుమానం వచ్చిన కార్మికులు వారిని కొద్దిదూరం వెంబడించారు. బోయపాలెం మెయిన్‌ సెంటర్‌వైపు వెళ్లిన ఇద్దరు కనిపించలేదు. దీంతో అనుమానంతో కారులో పరిశీలించగా ప్యాక్‌ చేసిన గంజాయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. యడ్లపాడు ఎస్‌ఐ జె.శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కారును పరిశీలించారు. గంజాయి నిల్వలు కనిపించడంతో క్రేన్‌ను తెప్పించి కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిలకలూరిపేట రూరల్‌ సీఐ ఎం.సుబ్బారావు, ఎక్సైజ్‌ సీఐ బి.లత, ఎస్‌ఐలు ఎస్‌ఐ జె.శ్రీనివాస్, షరీఫ్‌ కారులోని గంజాయ్‌ ప్యాకెట్లను బయటకు తీయించారు. 

121 ప్యాకెట్లలో గంజాయి 
కారులోని వెనుక సీటు, కింద, వెనుక డిక్కీభాగంగా మొత్తం 121 ప్యాకెట్లలో ఉన్న 242 కిలోల గంజాయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కారు రాజమండ్రి నుంచి చైన్నె వైపు వెళ్తోందని పోలీసులు భావిస్తున్నారు. తమ పరిధిలో స్థానికుల ద్వారా పట్టుబడిన కారును మంగళగిరి పోలీసులు వెంబడించారని, అంతేకాకుండా వారు గంజాయి నిల్వలున్న మరోకారుతో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దీంతో తాము స్టేషన్‌కు తరలించిన కారు, గంజాయి నిల్వల్ని మంగళగిరి పోలీసులకే అప్పగిస్తున్నామని ఎస్‌ఐ జె.శ్రీనివాస్‌ విలేకరులకు తెలిపారు.  

కారుటైర్‌ పగలడంతో పట్టుబడ్డారు...
గుంటూరు వైపు నుంచి హైవే పోలీసులు వెంబడిస్తున్న క్రమంలో దారి తప్పించి 16వ నంబర్‌ జాతీయ రహదారిలోకి ప్రవేశించిన గంజాయి లోడు కారు విశ్వనగర్‌ నగర్‌ వద్ద పోలీసుల తనిఖీలను గమనించి సర్వీసురోడ్డులోకి దిగి నేరుగా అదేమార్గంలో వెళ్లకుండా అండర్‌పాస్‌ వంతెన కిందగా అవతలి వైపు రోడ్డులోకి వెళ్లారు. బోయపాలెం దాటి వంకాయలపాడు క్వారీ రోడ్డు సమీపంలో సర్వీసు రోడ్డుపై కంకరరాళ్లు ఎక్కువగా ఉండటంతో కారు ముందు టైర్‌ పగిలింది. కారుటైరుకు పంక్చర్‌ వేయించుకోవడానికి తిరిగి వంకాయలపాడు అండర్‌పాస్‌ వంతెన కిందుగా బోయపాలెం వైపు వెనక్కు తిప్పారు. ఎవరికీ అనుమానం రాకుండా గ్రామం ప్రారంభంలోనే ఉన్న బ్రిక్స్‌ కంపెనీ లోనికి పోనిచ్చారు. బ్రిక్స్‌ లోడింగ్‌కు వచ్చే ట్రాక్టర్లకు అడ్డొస్తుందన్న భావనతో కారును పక్కకు పెట్టాలని కార్మికులు గట్టిగా చెప్పడంతో భయపడ్డ కారులోని వ్యక్తులు తమ బ్యాగుల్ని తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. 

గంజాయి ముఠా హల్‌చల్‌
మంగళగిరి : గంజాయి ముఠా దాష్టీకానికి తెగబడింది. విశాఖ మన్యం నుంచి చెన్నైకు శుక్రవారం ఉదయం కారులో గంజాయి తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు అధికారులు ముఠాను పట్టుకునేందుకు మండలంలోని కాజ టోల్‌గేట్‌ వద్ద మాటు వేశారు. వాహనం టోల్‌గేట్‌ వద్దకు రాగా అధికారులు తనిఖీ చేసేందుకు యత్నిస్తుండగా.. డ్రైవర్‌ వేగంగా వెళ్లి  టోల్‌గేట్‌ వద్ద అడ్డుగా ఉంచిన ఇనుప కడ్డీని ఢీకొట్టి పరారయ్యారు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు గుంటూరు, చిలకలూరిపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యడ్లపాడు వద్ద వాహనాన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనానికి పైలెట్‌గా ఉన్న మరో ముఠా కారును కాజ టోల్‌గేట్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు నిందితుల్ని రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top