కన్నపేగు ఆరాటం | boy missing in ananthapur district | Sakshi
Sakshi News home page

కన్నపేగు ఆరాటం

Jan 31 2018 7:08 AM | Updated on Sep 2 2018 4:37 PM

boy missing in ananthapur district - Sakshi

కంటతడి పెట్టిన ఈశ్వరమ్మ

స్కూలు బస్సు దిగి ఇంటికి చేరుకోవాల్సిన కుమారుడు ఎంతకీ రాలేదు. నిమిషం నిమిషానికీ తల్లిలో ఆందోళన. కుమారుడి కోసం ఇంటి నుంచి స్కూల్‌ బస్‌ పాయింట్‌ వరకు క్షుణ్ణంగా వెతుక్కుంటూ వెళ్లినా ఎక్కడా కనిపించలేదు. భర్త ద్వారా స్కూల్‌ యాజమాన్యానికి ఫోన్‌ చేస్తే తాము బస్సులో పంపించేశామని చెబుతున్నారు. మరి ఇంటికి రాకుండా ఎక్కడికెళ్లాడు. పసివాడిని ఎవరు తీసుకెళ్లారో.. ఎందుకు తీసుకెళ్లారో.. అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆ తల్లి హృదయం తల్లడిల్లుతోంది. వారం రోజులైనా ఆచూకీ కానరాకపోవడంతో భయాందోళనకు గురవుతోంది. నిద్రాహారాలు మాని కొడుకు కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంది.

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం రూరల్‌ పరిధిలోని కక్కలపల్లి కాలనీలో సురేష్, ఈశ్వరమ్మ దంపతులు నివాసముంటున్నారు. సురేష్‌ ఐచర్‌ వాహనాల కంపెనీలో మేనేజర్‌. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు గౌతమ్‌ ఉన్నాడు. ఎస్కేయూనివర్సిటీ సమీపంలోని కేంద్రీయ విద్యాలయం (సెంట్రల్‌ స్కూల్‌)లో మూడో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ స్కూల్‌బస్సులో పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. ఇంటికి బస్సు స్టాపింగ్‌ పాయింట్‌కు దాదాపు అర కిలోమీటరు దూరం ఉంది. ఒక్కో రోజు తండ్రి బస్‌ పాయింట్‌ వద్దకు వెళ్లి ఎక్కించేవాడు. ఒక్కోసారి బాలుడే నడుచుకుంటూ వెళ్లేవాడు. ఈ నెల 23న సాయంత్రం గౌతమ్‌ కళ్యాణదుర్గం రోడ్డులో (స్టాపింగ్‌ పాయింట్‌) స్కూలు బస్సు దిగాక ఇంటికి చేరుకోలేదు.

మిస్టరీగా మారిన కేసు
ఎలాంటి కేసులోనైనా ప్రాథమిక ఆధారాలు లభిస్తాయి. కానీ గౌతమ్‌ మిస్సింగ్‌ కేసులో ఒక్క ఆధారం కూడా లభించలేదని తెలుస్తోంది. ఎక్కడే కానీ అతడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. బస్సు దిగే ప్రాంతం నుంచి ఇంటి వరకూ ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. కళ్యాణదుర్గం బైపాస్‌ రోడ్డులో బస్సు వెనుక ఎవరైనా ఫాలో అయ్యారా అని ఆరా తీస్తే.. ఆ రోజు విద్యుత్‌ కోత అమల్లో ఉండడంతో ఎక్కువ శాతం సీసీ కెమెరాలు పనిచేయలేదు. ఆ ప్రాంతంతో బస్టాండ్, రైల్వే స్టేషన్, నగరంలో ప్రధాన రోడ్లలోని అన్ని సీసీ కెమెరాలూ పరిశీలించారు. ఎక్కడా అబ్బాయి కనిపించలేదు. 

హైదరాబాద్‌లో దొరికిన మరో బాలుడు
గౌతమ్‌ మిస్సింగ్‌ కేసు ఛేదించడంపై దృష్టి సారించిన టూటౌన్‌ పోలీసులకు మరో షాక్‌ తగిలింది. అనంతపురానికి చెందిన బాలుడు పట్టుబడినట్లు హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పోలీసుల నుంచి సమాచారం అందింది. ఈ బాలుడు గౌతమేనా అని ఆరా తీస్తే ఇద్దరూ వేర్వేరు. ఈ బాలుడు తల్లిదండ్రులు నగరంలోనే ఉన్నప్పటికీ ఎక్కడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఇంతకూ గౌతమ్, ఈ బాలుడు ఇద్దరూ కలిసే వెళ్లారా? వీరిద్దరికీ సంబంధాలు ఏవైనా ఉన్నాయా లేదా అన్న అంశంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఆ బాలుడిని తీసుకురావడానికి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు వెళ్లింది.  

నా కొడుకుని తీసుకొచ్చి పుణ్యం కట్టుకోండి
మాకు శత్రువులు లేరు. స్కూలు నుంచి సాయంత్రం పూట ఇంటికి వచ్చే నా కుమారుడు తిరిగి రాలేదు. ఏమై ఉంటుందో కూడా తెలియదు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో ఏనాడూ పల్లెత్తుమాట కూడా అనేట్లోళ్లం కాదు. నా కుమారుని తీసుకొచ్చి పుణ్యం కట్టుకోండయ్యా.  – ఈశ్వరమ్మ, గౌతమ్‌ తల్లి

త్వరలోనే ఛేదిస్తాం
విద్యార్థి గౌతమ్‌ మిస్సింగ్‌ కేసును లోతుగా ఆరా తీస్తున్నాం. విద్యార్థి ఇంటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం వలన ఆధారాలు లభించలేదు. హైదరాబాద్‌లో మరో బాలుడు ఉన్నాడంటే ప్రత్యేక బృందాన్ని పంపించాం. త్వరలో ఈ బాలుడి మిస్సింగ్‌ కేసు చేధిస్తాం.   – ఆరోహణరావు, సీఐ, టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement